Delhi Liquor Scam : మొన్న మనీష్.. నిన్న కవిత.. నేడు కేజ్రీవాల్.. ఒక్కొక్కరుగా రిలీజ్

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆరోపణలతో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు ఆయనకు మే 10న మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిని పొడిగించాలని ఆయన చేసిన అభ్యర్ధనను కోర్టు తిరస్కరించడంతో మళ్లీ జూన్ 2న ఆయన లొంగిపోయారు. ఈడీ కేసు కొనసాగుతుండగా.. జూన్ 26న ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. సీబీఐ కేసులో అరెస్ట్ కావడంతో ఆయన జైలు నుంచి విడుదల కాలేదు. తాజాగా, ఈ కేసులో బెయిల్ లభించడంతో తీహార్ జైలు నుంచి విడుదలకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా పలువురికి బెయిల్ వచ్చింది.
సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఒకటి.. బెయిల్ కోసం మరొకటి రెండు వేర్వేరు పిటిషన్లను అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేశారు. సీబీఐ కేసులో ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. అక్కడ చుక్కెదురు కావడంతో హైకోర్టుకే వచ్చారు. కానీ, బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది., బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ సీఎం సాక్షులను ప్రభావితం చేయవచ్చని సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పిటిషన్లపై ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com