Gaganyaan Mission : జనవరి 2026లో గగన్‌యాన్ తొలి ప్రయోగం.. మనిషికి బదులు వ్యోమమిత్ర రోబో ప్రయాణం!

Gaganyaan Mission : భారతదేశం ప్రతిష్ఠాత్మక మానవ అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ గగన్‌యాన్ ప్రారంభం కాస్త ఆలస్యం కానుంది. వాస్తవానికి ఈ ఏడాదిలోనే (2025) తొలి మిషన్‌ను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నా, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లింది. ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం.. గగన్‌యాన్ ప్రాజెక్టులో మొదటి వ్యోమ నౌక ప్రయోగం జనవరి 2026లో జరిగే అవకాశం ఉంది. ఈ మొదటి మానవ రహిత ప్రయోగంలో మనుషులకు బదులుగా వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోను పంపనున్నారు. గగన్‌యాన్ ప్రణాళిక, లక్ష్యాలు, భారతదేశం అంతరిక్ష చరిత్రలో 4వ దేశంగా నిలిచే అవకాశం గురించి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశం ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా తొలి మానవ రహిత ప్రయోగం జనవరి 2026లో జరగనుంది. ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ప్రకారం, తొలి ప్రయోగం జనవరి 2026లో ప్రారంభమై మార్చి లేదా ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. దీనికి G1 మిషన్ అని పేరు పెట్టారు. దీని తర్వాత G2, G3 మిషన్లు కూడా జరుగుతాయి.
ఈ మూడు మానవ రహిత మిషన్లలో మనుషులకు బదులుగా వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబో ప్రయాణిస్తుంది. అంతరిక్షంలో మనుషులు ఎదుర్కొనే కష్టాలు, సవాళ్లు ఏమిటో ఈ రోబో ద్వారా పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. మానవ ప్రయాణం నూటికి నూరు శాతం సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే మానవ సహిత మిషన్‌ను ప్రారంభిస్తారు. గగన్‌యాన్ మిషన్‌తో పాటు, భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరింత ముందుకు వెళ్లడానికి కొన్ని పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంది.
2027 నాటికి గగన్‌యాన్‌లో మనుషులను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ భూమి నుంచి 400 కి.మీ. ఎత్తులోని కక్ష్యకు చేరుకుంటుంది. 2-3 మంది వ్యోమగాములను తీసుకెళ్లే లక్ష్యం ఉంది. అమెరికా నాసా తరహాలో, భారతదేశం కూడా తన సొంత ఇండియన్ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని 2028 నాటికి ప్రారంభించాలని యోచిస్తోంది.
మానవ అంతరిక్ష యాత్రలను విజయవంతంగా నిర్వహించిన దేశాల సరಸన త్వరలో భారత్ చేరనుంది. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం మూడు దేశాలు మాత్రమే (అమెరికా, రష్యా, చైనా) మనుషులను అంతరిక్షంలోకి పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 2027 నాటికి గగన్‌యాన్ మానవ సహిత మిషన్ విజయవంతమైతే, ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో చైర్మన్ ప్రకారం గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇప్పటికే 8,000కు పైగా పరీక్షలు నిర్వహించారు. వ్యోమ నౌకకు అవసరమైన అన్ని హార్డ్‌వేర్ భాగాలు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతರಿక్ష కేంద్రానికి చేరుకున్నాయి. వాటిని అమర్చే పని జరుగుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

