Gas Cylinder Price Hike : వంటగదిలో యుద్ధ సెగ.. ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన గ్యాస్ ధరలు.

Gas Cylinder Price Hike : వంటగదిలో యుద్ధ సెగ.. ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిన గ్యాస్ ధరలు.
X

Gas Cylinder Price Hike : మధ్యప్రాచ్యంలో మండుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ సామాన్యుడి వంటింట్లో మంటలు రేపుతున్నాయి. శనివారం (మార్చి 7, 2026) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా భారమయ్యాయి. అటు కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. ప్రధానంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా అయ్యే హోర్ముజ్ జలసంధి మూతపడటంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయి, ఈ ధరల పెరుగుదలకు కారణమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సామాన్యుడి నడ్డి విరిచిన రూ. 60 పెంపు

గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై ఏకంగా రూ.60 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గడిచిన 11 నెలల్లో ధర పెరగడం ఇదే మొదటిసారి కాగా, గత ఆరేళ్ల కాలంలో ఇంత భారీ స్థాయిలో (రూ.60) పెంపుదల ఎప్పుడూ జరగలేదు. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో రూ.144 పెరిగింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత పెద్ద మొత్తంలో బాదుడు మొదలైంది. ఈ పెంపుతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.900 మార్కును దాటేసింది. దాదాపు 30 నెలల తర్వాత సిలిండర్ ధర రూ.900 దాటడం ఇదే తొలిసారి.

కమర్షియల్ సిలిండర్ రూ. 2000 దాటేసింది

వ్యాపార అవసరాలకు వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. తాజా పెంపుతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.114.50 పెరిగి, మూడేళ్ల తర్వాత మళ్ళీ రూ.2,000 మార్కును దాటింది. ముఖ్యంగా చెన్నైలో ఈ ధర రూ.2,043కు చేరింది. గత నాలుగు నెలల్లో కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఐఓసీఎల్ (IOCL) గణాంకాల ప్రకారం.. కేవలం ఈ నాలుగు నెలల్లోనే కమర్షియల్ గ్యాస్ ధర రూ.302.50 పెరిగింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లలో తినుబండారాల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఎందుకీ ధరల బాదుడు?

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదరడం వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందిస్తూ.. దేశంలో ఇంధన కొరత ఏమీ లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పౌరులకు చవకైన, స్థిరమైన ఇంధనాన్ని అందించడమే తమ ప్రాధాన్యత అని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అయితే, యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సిలిండర్ ధర రూ.1,000 మార్కును కూడా దాటే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story