Nagaland Road accident : రెప్పపాటులో మృత్యువు

మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదనడానికి ఈ ఘటనే ఉదాహరణ. భారీ వర్షాలతో ఆ ప్రాంతం లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ పెద్ద బండరాయి వాహనాలపై దూసుకు రావడంతో మూడు కార్లు పూర్తిగా నుజ్జనుజ్జయ్యాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన నాగాలాండ్‌లో జరిగింది.
నాగాలాండ్ చుమౌకేదిమా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఘాట్ రోడ్డు హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కోహిమా నుంచి దిమాపుర్‌వైపు 29వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పకల్ పహర్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇంతలో రెండు భారీ కొండరాళ్లు వేగంగా రోడ్డుపైకి దొర్లుతూ వచ్చాయి. అంత వేగంగా ఎత్తు నించి పడడం తో అసలేం జరిగిందో తెలిసేలోపే మొత్తం మూడు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారని, ముగ్గురు గాయపడ్డారని పోలీసులు ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక బండరాయి రెండు కార్లను ధ్వంసం చెయ్యగా, మరో బండరాయి వల్ల మరో కారు ధ్వంసమైంది. తొలుత ఓ కారుపై పడిన బండ రాయి, తర్వాత పక్కనే ఉన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆ రెండు కార్లు బండ కింద చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటన దృశ్యాలు ధ్వంసమైన కార్ల వెనుక నిలిచిన వాహనాలకు అమర్చిన కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదంపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com