Goli Shyamala : వైజాగ్ నుంచి కాకినాడ వరకు బంగాళాఖాతం ఈదిన గోలి శ్యామల

Goli Shyamala : వైజాగ్ నుంచి కాకినాడ వరకు బంగాళాఖాతం ఈదిన గోలి శ్యామల
X

విశాఖకు చెందిన 55 ఏళ్ళ గోలి శ్యామల సముద్రపు ఈతలో మరో రికార్డ్ సృష్టించారు. విశాఖ నుంచి కాకినాడ వరకు బంగాళా ఖాతంలో సుమారు 150కిలోమీటర్లు నిరంతరాయంగా ఆమె ఈదారు. డిసెంబర్ 28న విశాఖ ఆర్ కె బీచ్ నుంచి ప్రారంభించిన ఈ ఈత శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. కాకినాడ సూర్యారావుపేటలోని ఎన్టీఆర్ బీచ్ కు ఆమె చేరుకున్నారు. ఇక్కడ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. రోజూ 30కిలోమీటర్ల చొప్పున లక్ష్యంగా నిర్దేశించుకుని ఆమె ఈతను నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో 1973లో జన్మించిన శ్యామల అనంతర కాలంలో విశాఖలో స్థిర పడ్డారు. ఆమె భారతదేశానికి చెందిన అంతర్జాతీయ వాటర్ స్విమ్మర్, యానిమేషన్ సినిమాల నిర్మాత, దర్శకురాలు, రచయితగా గుర్తింపు పొందారు. 2020వ సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రవిశిష్టమహిళా పురస్కారం కూడా ఆమె అందుకున్నారు.

2021లో భారత్ - శ్రీలంక మధ్యనున్న పాక్ జలసంధిని 30కిలోమీటర్ల పొడవున ఈదిన తొలి మహిళగా శ్యామల రికార్డ్ సాధించారు. అలాగే 2019 లో గుజరాత్ లోని పోరుబందర్ లో అరేబియా మహా సముద్రంలో జరిగిన ఈత పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. 2019లో సౌతాఫ్రికాలోని వాంగూలో ఫినా వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత దేశం తరపున పాల్గొన్న తొలి మహిళ ఆమె. ఎంతో క్లిష్టమైన కాటలిన ఛానల్ ను 10గంటల 4నిమిషాల 45 సెకన్ల పాటు ఏకవికిన ఈతకొట్టి రికార్డ్ సాధించారు. గతంలో కన్యా కుమారి నుంచి శ్రీలంక వరకు సముద్రంలో ఆమె ఈదుకుంటూ వెళ్ళారు. ఐదుపదుల వయసుపైబడ్డ శ్యామల మహిళాశక్తికి ఓ ఉదాహరణగా నిల్చారు. కాకినాడ తీరానికి ఈదుకుంటూ వచ్చిన శ్యామలకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ఇతరులు ఘనంగా సత్కరించారు.

Tags

Next Story