PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే పీఎం కిసాన్ డబ్బులు.

PM Kisan : దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు గుడ్ న్యూస్. ఈ దీపావళి పండుగ సందర్భంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడానికి సమయాన్ని ఖరారు చేసింది. నిధులు ఈ నెల చివరి వారంలో జమ అవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే, కొంతమంది అధికారులు మాత్రం 21వ విడత నిధులు అక్టోబర్ 18 లేదా 19 తేదీల్లోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వరదలతో నష్టపోయిన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ నిధులతో పాటు తమ రాష్ట్ర పథకమైన అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద గతంలో ఆగస్టు 2వ తేదీన ఈ ఏడాదికి సంబంధించిన మొదటి విడత నిధులను పీఎం కిసాన్‌తో కలిపి రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీని ద్వారా రైతులు ఒకేసారి రూ.7 వేలు చొప్పున అందుకున్నారు. ఈసారి కూడా పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.
అయితే, ఈసారి నిధులు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అధికారులు పదేపదే ప్రకటించినట్లుగా, ఇ-కేవైసీ పూర్తి చేయని రైతులకు ఈసారి నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 40.78 లక్షల మంది రైతులు అర్హులుగా ఉండగా, 20వ విడతలో 40.77 లక్షల మందికి మాత్రమే నిధులు అందాయి. తెలంగాణలో కూడా 30.69 లక్షల మంది అర్హులు కాగా, 30.62 లక్షల మందికే నగదు అందింది.
పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా ఇ-కేవైసీ పూర్తి చేయాలి. దీనిని పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా లేదా పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా, ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకపోవడం, లేదా బ్యాంకింగ్ వివరాలు తప్పుగా ఉన్నా కూడా నిధుల జమలో సమస్యలు వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి, రైతులందరూ పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అర్హతను ముందే తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com