ITR : గుడ్ న్యూస్.. ఐటీఆర్‌ గడువు పొడిగింపు

ITR : గుడ్ న్యూస్.. ఐటీఆర్‌ గడువు పొడిగింపు
X

ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువును మరో రోజు పొడిగిస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రోజు కూడా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం లభించింది.

నిజానికి ఐటీఆర్‌ దాఖలుకు సోమవారమే చివరి తేదీ. అయితే గడువు ముగుస్తుండటంతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒకేసారి ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. దీనివల్ల పోర్టల్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగి, సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం సీబీడీటీ గడువును ఒక రోజు పొడిగించింది.

ఈ ఏడాది ఐటీఆర్‌లు రికార్డు స్థాయిలో దాఖలయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. వీటిలో ఇప్పటికే 6.03 కోట్ల రిటర్నులను అధికారులు వెరిఫై చేయగా, 4 కోట్ల ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌ను కూడా పూర్తి చేశారు.

పొడిగించిన గడువును కూడా వినియోగించుకోలేని వారు బుధవారం నుంచి జరిమానాతో రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు దాటిన వారికి రూ. 5,000, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రూ. 1,000 ఆలస్య రుసుముతో పాటు వడ్డీ కూడా వర్తిస్తుంది.

Tags

Next Story