Rainfall Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

Rainfall Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు
14 మంది మృతి,ఐఎండీ హెచ్చరికలు జారీ

దేశంలోని పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర,గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ సోమవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. సోమవారం రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురుస్తుందని ఐఎండీ ఎక్స్ పోస్టులో తెలిపింది.

గుజరాత్‌లో ఆదివారం అకాల భారీ వర్షాలు, వడగళ్ల వానల కారణంగా 14 మంది మరణించారు. వడగళ్ల వర్షాల వల్ల ఇళ్లు,పంటలకు విస్తృతంగా నష్టం వాటిల్లింది. ఆదివారం కురుస్తున్న వడగళ్ల వర్షాల వల్ల 10 మంది గాయపడ్డారు. గుజరాత్‌లోని 251 తాలూకాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల్లో 220 తాలూకాల్లో 50 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది.చాలా చోట్ల ఈదురు గాలులతో కూడిన బలమైన గాలులు వీయడంతో చెట్లు కూలిపోయాయి.


భారీ వడగళ్ల వర్షంతో పాటు భారీ గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. శాటిలైట్ చిత్రాన్ని చూస్తే గుజరాత్ రాష్ట్రలో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని ముంబయి వాతావరణకేంద్రం తెలిపింది. ముంబయి, పాల్ఘార్, ధూలే, నందూర్ బర్, రాయగడ, థానే, రత్నగిరి, సింధూదుర్గ్, నాసిక్, అహ్మద్ నగర్, పూణే జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు.

పిడుగుపాటుకు దహోద్‌లో ముగ్గురు మృతి చెందారు. భరూచ్‌లో ఇద్దరు,సూరత్, ద్వారక, పంచమహల్, సురేంద్రనగర్, అమ్రేలి, ఖేడా, అహ్మదాబాద్ రూరల్, సబర్కాంత, బోటాడ్‌లలో ఒక్కొక్కరు మరణించారు. వివిధ పిడుగుపాటు ఘటనల్లో 40 జంతువులు కూడా మృత్యువాత పడ్డాయి. రాజ్‌కోట్‌లోని ఖండేరీ క్రికెట్ స్టేడియానికి భారీ వర్షం తీవ్ర నష్టం కలిగించింది. స్టేడియానికి రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చని అంచనా వేస్తున్నారు. సౌరాష్ట్రలోని మోర్బిలో సిరామిక్ పరిశ్రమలు వర్షం కారణంగా మూసివేయవలసి వచ్చింది.

పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. అధికారిక పర్యటన నిమిత్తం జపాన్‌లో ఉన్న ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వ్యవసాయ శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడి రైతులకు జరిగిన నష్టంపై చర్చించారు. పంట నష్టంపై సర్వే చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.ఈశాన్య అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలపై ఏర్పడిన తుపాను కారణంగా అకాల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. గుజరాత్ రాష్ట్రంలో ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story