Indian Army Jawan : పెళ్లైన మూడో రోజుకే బార్డర్కు.. జవాన్ భార్య ఏమందంటే?

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. వివాహ సెలవులకు ఇంటికొచ్చిన జవాన్ కు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దీంతో పెళ్లయిన మూడు రోజులకే భార్యను వదిలి బార్డర్ కు వెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ వివాహం 2025 మే5న జరిగింది. ఆయనకు ఎమర్జెన్సీ కాల్ రావడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. మనోజ్ భార్య యామిని మాత్రం నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్ కు పంపుతున్నా' అంటూ తన భర్తను బార్డర్ కు పంపించింది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలడంతో భారత్ ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి... పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరలపై వైమానిక దాడులు నిర్వహించింది. దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జాష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్రలు పోషించిన ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు అంతం చేశాయి. దీని తరువాత ఇండియన్ ఆర్మీ, ప్రభుత్వ ఉద్యోగులు , అధికారుల సెలవులను కేంద్రం రద్దుచేసింది. సెలవులపై ఇంటికి వెళ్లిన వారిని వెనక్కి రప్పి్ంచాలని ఆదేశాలు జారీ చేసింది.
అందులో భాగంగానే జల్గావ్‌లోని పచోరాకు చెందిన మనోజ్ పాటిల్ కు కాల్ వచ్చింది. మే 5న అతనికి యామిని అనే అమ్మాయితో వివాహం జరగగా.. మే 8న అతన్ని వెంటనే రిపోర్ట్ చేయమని అధికారుల నుంచి పిలుపు వచ్చింది.. అతని భార్య యామిని ఆపరేషన్ సిందూర్ కోసం తన సిందూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్ కు పంపుతున్నా అని చెప్పడం నిజంగా అభినందించాల్సిందే. పచోరా రైల్వే స్టేషన్‌లో జవాన్ మనోజ్ పాటిల్‌ను దేశ సరిహద్దుకు పంపుతున్నప్పుడు అతని తల్లిదండ్రులు, భార్య, సోదరుడు, ఇతరులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com