Mumbai Rain: ముంబైను ముంచెత్తిన భారీ వర్షం..విద్యాసంస్థలు బంద్
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. స్పైస్‌జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాయి.
ముంబై విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే విమానం నంబర్ UK534 హైదరాబాద్‌కు తిరిగి వస్తోందని, రాత్రి 9.15 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతుందని విస్తారా తెలిపింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరో విమానం UK941 హైదరాబాద్‌కు మళ్లించబడింది. రాత్రి 9.10 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణీకులు తమ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని ‘స్పైస్‌జెట్’ ఎక్స్‌లో విజ్ఞప్తి చేసింది.
ముంబై మరియు పొరుగు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలె జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. ములుండ్ మరియు దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైం. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో విపరీతమైన భారీ వర్షాలు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.
ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో తుఫాను సర్క్యులేషన్ మీదుగా ఒక ద్రోణి నడుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముంబయి, పాల్ఘర్, నందుర్బార్, ధూలే, జల్గావ్, షోలాపూర్, సతారా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శాఖ వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com