North rains: కుండపోత వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీ, పంజాబ్, హరియాణాతో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. యమున సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే వార్నింగ్ మార్క్‌ను దాటిన యమునా నది నీటిమట్టం.. ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హరియాణాలోని హతిన్‌కుంద్ బ్యారేజ్ నుంచి యమునా నదిలోకి 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం పెరిగింది. దీంతో ఏ క్షణానైనా యమునా నది ఉప్పొంగి ఢిల్లీకి వరదలు సంభవించే ముప్పు ఉంది. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు.
మధ్యాహ్నం 12గంటల కల్లా నీటిమట్టం 205.5 మీటర్లకు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మంత్రి ఆతిషి యమునా నది పరిస్థితిని పర్యవేక్షించారు. ఇప్పటికే 16 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్విక్ రెస్పాన్స్ టీమ్, బోట్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్.. వర్షాలపై అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.
కుండపోత వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే బియాస్ నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నది వెంట రోడ్లపై పార్కు చేసిన వాహ నాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ఇవాళ కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 22కి పెరిగింది.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. అయితే అదృష్టవశాత్తు కొన్ని కార్లు కొండరాళ్ల బారి నుంచి తృటిలో తప్పించుకున్నాయి. కొంత ఆలస్యమైతే బండరాళ్ల కింద అవి నలిగిపోయేవి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com