North india: కుంభవృష్టి వానలు..ముంచెత్తుతున్న వరదలు

North india: కుంభవృష్టి వానలు..ముంచెత్తుతున్న వరదలు
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఉత్తర భారతాన్ని వరణుడు ముంచెత్తుతున్నాడు. రాజస్థాన్ నుంచి లద్దాఖ్ వరకు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఓ వైపు కుంభవృష్టి వానలు మరో వైపు వరదలతో ఉత్తరభారతం అతలాకుతలమయింది. రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బియాస్ నదిలో ప‍్రవాహం ప్రమాద స్థాయిని మించి పారుతోంది. అనేక రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్థంభించాయి.పలు రైళ్లు రద్దయ్యాయి. ఇప్పటివరకు వేర్వేరు ఘటనల్లో 19 మంది చనిపోయారు. వరద ఉధృతికి బియాస్ నది పక్కనే ఉన్న నేషనల్ హైవే కొట్టుకుపోయింది. రోడ్డుపైనే ప్రవాహం ఉద్ధృతంగా పారుతోంది. పలుచోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో మండీ- కులు రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.ఉత్తరాదిలో వర్షాలపై కేంద్రహోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.

ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.1982 తర్వాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.యమునానది పొంగి ప్రవహిస్తోంది.లక్ష క్యూసెక్కుల నీటిని ఈ నదిలోకి హర్యాన రీలీజ్ చేయడంతో.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రేపటికి యమునా నదిలో నీటి మట్టం ప్రమాదస్థాయిని దాటేస్తుందని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. ఢిల్లీలో 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టింది.ఏకంగా 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.1958 తర్వాత జూలైలో ఇలా జరగడం ఇది మూరోసారి.

హిమాచల్‌ ప్రదేశ్‌లో జనజీవనం అస్తవ్యస్థమైంది. వరదల ఉధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.మనాలీలో వరద ప్రవాహంలో కార్లు కొట్టుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 133 మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లలో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు.

ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.రిషికేశ్- బద్రీనాథ్ హైవేపై గులార్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఓ జీపు గంగానదిలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు ఉధమ్‌సింగ్‌ నగర్‌లో వర్షాలకు ఓ ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. సిమ్లా, సిర్మౌర్, లాహుల్, స్పితి, ఛంబా, సోల్ జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

రాజస్థాన్‌లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూలో వరదల కారణంగా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కతువా, సాంబ జిల్లాల్లో మూడో రోజులుగా ఎడుతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. 12 రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story