Heavy Rains :వరదలతో ఉత్తరాది విలవిల

ఉత్తరాది రాష్ట్రాలు వర్షాలతో విలవిలలాడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ర్టాల్లో గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు, నివాస ప్రాంతాలు, చెరువులకు తేడా లేకుండా కనిపిస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భవనాలు, ఇండ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. సాధారణ జనజీవనం అతలాకుతలమైంది. వరద నీటిలో లారీలు, కార్లు వంటి వాహనాలతో పాటు రోడ్లు కూడా కొట్టుకుపొయిన ఘటనలు పలు ప్రాంతాల్లో చోటుచేసుకొన్నాయి.
కొండచరియలు విరిగిపడటం, వరదలు, ఇతర వర్షం సంబంధిత ఘటనల్లో ఉత్తరాది రాష్ర్టాల్లో గత మూడు రోజుల వ్యవధిలో 60 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. యూపీలో పిడుగుపాటు, వరదల్లో కొట్టుకుపోవడం, ఇతర ఘటనల కారణంగా 34 మంది, హిమాచల్‌ప్రదేశ్‌లోని కొండచరియలు విరిగిపడటం కారణంగా నలుగురు, వరదలు కారణంగా 17 మంది మరణించారు. వరదల్లో పలు చోట్ల వందలాదిమంది చిక్కుకుపోయారని, వారికి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాది రాష్ర్టాల్లోని నదులు పొంగి పొర్లుతున్నాయి. హర్యానా నుంచి వరద నీరు పోటెత్తడంతో ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యమున నదిలో నీటి మట్టం 206 మీటర్లు దాటితే, సమీప లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. వర్షాల ప్రభావంతో పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్ వంటి పలు రాష్ర్టాల్లో బడులకు సెలవులు ప్రకటించారు.
వర్ష విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో 39 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించినట్టు అధికారులు వెల్లడించారు.
ఉత్తరాదితోపాటు దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నైరుతి రుతుపవనాల కాలంలో జూన్‌లో దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాత లోటును పూడ్చాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలపై అధికంగా ఆధారపడే మధ్య భారత రీజియన్‌లో 4 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. దక్షిణ భారత్‌లో వర్షపాత లోటు 45 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది.
మధ్యధరా రీజియన్‌లో ఏర్పడే తుఫానులు, నైరుతి రుతుపవనాలు పరస్పరం కలసిపోవడమే ఉత్తరాది రాష్ర్టాల్లో కుండపోత వర్షాలకు కారణమని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నిజానికి రుతుపవనాలు లేని కాలంలో అంటే శీతాకాలంలో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్‌ల ప్రభావం కనిపిస్తుంటుందని, అయితే ఇప్పుడు రుతుపవనాల సమయంలోనే వాటి ప్రభావం ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com