Nashik IT company horror: నాసిక్ లైంగిక వేధింపుల కేసులో ఉద్యోగులను సస్పెండ్ చేసిన టీసీఎస్, ఆరుగురు అరెస్ట్

దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్‌లో వెలుగుచూసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఆదివారం కంపెనీ ప్రకటించింది. వేధింపులు, బలవంతపు చర్యల పట్ల తమ సంస్థ జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని టీసీఎస్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది మార్చిలో ఈ వివాదం మొదలైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన సహోద్యోగి ఒకరు శారీరక సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. ఇదే తరహాలో వేధింపులకు గురైన మరికొందరు బాధితులు ముందుకు రావడంతో, ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. లైంగిక వేధింపులతో పాటు బలవంతంగా బీఫ్ తినిపించడం, నమాజ్ చేయించడం, మత మార్పిడులకు కూడా పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు తీవ్రత దృష్ట్యా నాసిక్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా సమాచారం ఆధారంగా, ఇప్పటివరకు కనీసం ఆరుగురు టీసీఎస్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా పుణెకు చెందిన ఒక మానవ వనరుల (హెచ్‌ఆర్) అధికారిని కూడా ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, ఈ పరిణామాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. కేసులో వేగంగా స్పందించిన నాశిక్ పోలీసులను ఆయన అభినందించారు. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
