G20 Summit: మోదీ జీ.. నేను రావట్లే
వచ్చే నెలలో దిల్లీలో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సు(G20 Summit)కు తాను హాజరు కాలేనంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin ) ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi )కి తెలిపారు. రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్(Foreign Minister Sergey Lavrov ) భారత్‌కు వస్తారని పుతిన్ వెల్లడించారు. ఈ మేరకు మోదీతో పుతిన్ ఫోన్‌లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం(PMO) తెలిపింది. ఇద్దరు నాయకులు భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఫోన్‌లో సమీక్షించినట్లు PMO ఓ ప్రకటనలో వెల్లడించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సహా పలు ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారని పేర్కొంది.
ఈ ఏడాది జీ-20 బృందానికి భారత్ (India) అధ్యక్షత వహిస్తోంది. సెప్టెంబరు 9-10 తేదీల్లో దిల్లీ వేదికగా(New Delhi on 9-10 September 2023 ) జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు 29 మంది దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు.
పుతిన్ ఈ జీ20 సమ్మిట్‌కి హాజరుకాకపోవడానికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి పుతిన్‌పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా.. ఉక్రెయిన్‌లోని పిల్లలను రష్యా అపహరించిందన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC) పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి పుతిన్ విదేశీ పర్యటనల్ని ఆపేశారు. ఒకవేళ విదేశాలకు వెళ్తే పుతిన్‌ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఈ కారణం వల్లే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. కేవలం వర్చువల్‌గా మాత్రమే ఆ సదస్సుకు హాజరయ్యారు. ఇప్పుడు భారత్‌లో జరగబోయే జీ20 సమ్మిట్‌కు దూరంగా ఉంటున్నారు. జీ20 సమ్మిట్‌లో కూడా పుతిన్ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తారని తెలుస్తున్నది.
అయితే, విదేశాల్లో పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. సంబంధిత దేశం తమపై యుద్ధాన్ని ప్రకటించినట్లేనని రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి ఉప ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్(Dmitry Medvedev) వ్యాఖ్యానించారు. విదేశాల్లో పుతిన్ అరెస్టు ప్రయత్నాలను ‘యుద్ధ ప్రకటన’గా చూస్తామని హెచ్చరించారు. అరెస్టు అసాధ్యమని పేర్కొంటూనే.. ఒకవేళ ఇదే జరిగితే రష్యన్ ఆయుధాలు ఆ దేశాన్ని తాకుతాయన్నారు. పుతిన్ అరెస్టు అనేది ఎప్పటికీ జరగని పని అని... ఒకసారి అరెస్ట్‌ను ఊహిస్తే అది రష్యాపై యుద్ధాన్ని ప్రకటించినట్లే’ అని మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఆ దేశంలోకి మాస్కో రాకెట్లు, ఇతర ఆయుధాలు దూసుకెళ్తాయని హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com