LPG Deal: చరిత్ర సృష్టించిన భారత్-అమెరికా..తొలిసారి LPG ఒప్పందం.. మనకెలా లాభం?

LPG Deal: చరిత్ర సృష్టించిన భారత్-అమెరికా..తొలిసారి LPG ఒప్పందం.. మనకెలా లాభం?
X

LPG Deal: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న వేళ ఇరు దేశాల ఇంధన సహకారం ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. 2026 సంవత్సరం కోసం అమెరికా నుంచి 2.2 మిలియన్ టన్నుల ఎల్‌పిజి కొనుగోలు చేయడానికి భారత్ చారిత్రక ఒప్పందంపై సంతకం చేసింది. అమెరికాతో భారత్ చేసుకున్న మొట్టమొదటి ఎల్‌పిజి ఒప్పందం ఇదే కావడం విశేషం. ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ డీల్‌ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి చారిత్రక తొలి ఒప్పందంగా అభివర్ణించారు.

ఇప్పటివరకు, భారతదేశం తన ఎల్‌పిజి అవసరాల కోసం ప్రధానంగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడింది. అయితే ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్‌లో వేగంగా వస్తున్న మార్పుల దృష్ట్యా, ఇంధన సరఫరా కోసం వివిధ దేశాలపై ఆధారపడాలని భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌పిజి ఉత్పత్తిదారులలో అమెరికా ఒకటి. ఈ కొత్త ఒప్పందం ద్వారా భారత్‌కు ఎల్‌పిజి సరఫరాలో స్థిరత్వం లభిస్తుంది. ఈ ఒప్పందం భారత్-అమెరికా మధ్య ఇంధన సహకారాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్తులో LNG (ద్రవ సహజ వాయువు), ముడి చమురు, క్లీన్ ఫ్యూయల్ రంగాలలో కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఒప్పందం ఎందుకు కీలకం?

భారతదేశానికి అవసరమైన ఎల్‌పిజిలో దాదాపు సగం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. అందువల్ల, స్థిరంగా, తక్కువ ధరలకు సరఫరా చేయగల నమ్మకమైన వనరులు భారత్‌కు చాలా అవసరం. ఈ ఒప్పందం మౌంట్ బెల్వ్యూ బెంచ్‌మార్క్ ఆధారంగా జరిగింది. ఇది ప్రపంచ ఎల్‌పిజి మార్కెట్‌లో పారదర్శకమైన, స్థిరమైన ధరల వ్యవస్థగా పరిగణించబడుతుంది. దీనివల్ల ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావం భారత్‌పై పరిమితంగా ఉంటుంది. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, అమెరికా ఉత్పత్తిదారులతో నెలల తరబడి చర్చలు జరిపి ఈ డీల్‌ను ఖరారు చేశాయి. 2026లో ప్రపంచ మార్కెట్ అస్థిరంగా ఉన్నా, భారత్‌కు సరఫరాలో ఎలాంటి సమస్య ఉండదు.

గత ఏడాది అంతర్జాతీయంగా ఎల్‌పిజి ధరలు 60 శాతం కంటే ఎక్కువ పెరిగినా, భారత్ ప్రభుత్వం దాదాపు రూ.40,000 కోట్లకు పైగా సబ్సిడీలు ఇవ్వడం ద్వారా ఉజ్వల లబ్ధిదారులకు సిలిండర్‌ను రూ.500-రూ.550 కే అందిస్తోంది. అమెరికాతో చేసుకున్న ఈ దీర్ఘకాలిక ఒప్పందం వల్ల భవిష్యత్తులో దేశీయంగా ధరలను నియంత్రించడం సులభమవుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై పడే సబ్సిడీ భారం తగ్గే అవకాశం ఉంది.ఈ ఒప్పందం వల్ల దేశంలో ఎల్‌పిజి సరఫరాలో స్థిరత్వం వస్తుంది. దీని ద్వారా గల్ఫ్ దేశాలపై మన ఆధారపడటం తగ్గుతుంది.

ఏ రంగాలకు లాభం?

ఈ ఒప్పందం ద్వారా ప్రధానంగా ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలు లాభపడతాయి. ఎందుకంటే ఈ మూడు సంస్థలే దేశీయ ఎల్‌పిజి సరఫరాను నిర్వహిస్తాయి. వీటితో పాటు అమెరికా నుంచి LPG సరఫరా పెరగడం వల్ల పోర్టుల మౌలిక సదుపాయాలు, రవాణా , లాజిస్టిక్స్ రంగాలలో ఉన్న కంపెనీలకు వ్యాపారం పెరుగుతుంది. రాబోయే సంవత్సరాల్లో పెట్రోకెమికల్ రంగంలో గ్యాస్ ఆధారిత ముడి పదార్థాల లభ్యత కూడా పెరుగుతుందని అంచనా. మొత్తంగా భారత్-అమెరికా మధ్య జరిగిన ఈ తొలి ఎల్‌పిజి ఒప్పందం భారతదేశ ఇంధన భద్రతకు ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుంది.

Tags

Next Story