ASIA CUP: మనదే ఆసియా కప్‌

ASIA CUP: మనదే ఆసియా కప్‌
X
ఉత్కంఠభరిత మ్యాచ్‌లో మలేషియాపై గెలుపు.... చిరస్మరణీయ విజయమన్న మోదీ....

ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌ అదిరిపోయే ఆటతీరుతో విజేతగా నిలిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో టీమ్‌ఇండియా 4-3తో మలేషియాను మట్టికరిపించి నాలుగోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఫైనల్‌ వరకు ఎదురులేకుండా అజేయంగా నిలిచిన భారత జట్టుకు తుది పోరులో మలేసియాపై గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ మలేషియా అంత తేలిగ్గా వదలలేదు. చివరి నిమిషం వరకూ గట్టిగా పోరాడింది. దీంతో మ్యాచ్‌ అసాంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఓటమి అంచుల నుంచి అద్భుతంగా పోరాడిన భారత్‌.. నాలుగోసారి ఆసియా కప్‌ను ఒడిసిపట్టింది.


భారత్‌ అదరగొట్టింది. ఓటమి అంచున నిలిచినా గొప్పగా పోరాడి ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీని ముద్దాడింది. 9వ నిమిషంలో జుగ్‌రాజ్‌ పెనాల్టీకార్నర్‌ను సద్వినియోగం చేసి భారత్‌కు తొలి గోల్‌ అందించాడు. కానీ చూస్తుండగానే మలేషియా 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 14వ నిమిషంలో అబుకమల్‌, 18వ నిమిషంలో రహీమ్‌, 28వ నిమిషంలో అమీనుద్దీన్‌ స్వల్ప వ్యవధిలో మూడో గోల్స్‌ చేసి భారత్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఈ గోల్స్‌తో మలేసియాను తిరుగులేని స్థితిలో నిలిచింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన భారత్‌ అవకాశాలను వృథా చేసుకుంది. మూడో క్వార్టర్‌ ఆఖరికి వచ్చినా గోల్స్‌ పడకపోవడంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పదేమో అనిపించింది. కానీ ఆ క్వార్టర్‌ చివర్లో అద్భుతమే జరిగింది.

చివరి క్వార్టర్‌లో టీమిండియా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. 45వ నిమిషంలో పెనాల్టీస్ట్రోక్‌ను హర్మన్‌ప్రీత్‌ గోల్‌ కొట్టి స్కోరు లోటును 2-3కు తగ్గించగా.. అదే నిమిషంలో గుర్జాంత్‌ ఓ మెరుపు గోల్‌ సాధించి 3-3తో స్కోరు సమం చేయడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. వరుసగా రెండు గోల్స్‌ సమర్పించుకుని డీలాపడిన మలేసియాకు మరో షాక్‌ ఇస్తూ 56వ నిమిషంలో ఆకాశ్‌దీప్‌ గోల్‌ చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆఖరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్‌ మరచిపోలేని విజయాన్ని అందుకుంది.


ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియాకు అభినందనలని మోదీ ట్వీట్‌ చేశారు. ఆసియా కప్‌ను నాలుగోసారి కైవసం చేసుకోవడం జట్టు అంకిత భావానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. భారత ఆటగాళ్ల దృఢ సంకల్పం, అసాధారణ ఆటతీరుతో దేశం గర్విస్తోందని మోదీ అన్నారు.

Tags

Next Story