సరిహద్దు దాటివచ్చి కొడతాం... పాక్‌కు రాజ్‌నాథ్ హెచ్చరిక

సరిహద్దు దాటివచ్చి కొడతాం... పాక్‌కు రాజ్‌నాథ్ హెచ్చరిక
పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ గట్టి హెచ్చరిక..సరిహద్దు అవతలికి వచ్చి కొడతామన్న రక్షణమంత్రి... భారత్‌ గతంలోలా లేదని హితవు

భారత్‌పై ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే పాకిస్థాక్‌కు.. రక్షణమంత్రి రాజ్‌నాథ్ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అవసరమైతే సరిహద్దు ఇవతలి నుంచే కాకుండా అవతలికి వచ్చి కూడా కొడతామని రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. జమ్మూ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ భద్రత సదస్సులో పాల్గొన్న రాజ్‌నాథ్‌... సరిహద్దు నుంచే దాయాది దేశానికి దిమ్మతిరిగిపోయే వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతోందని గుర్తు చేశారు. ఇప్పుడు భారతదేశం గతంలోలా లేదన్న రాజ్‌నాథ్‌.. శక్తిమంతమవుతూనే ఉందని గుర్తు చేశారు. భారత్‌ రోజురోజుకు బలపడుతోందన్నారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌ అంటే ఏమిటో మొత్తం ప్రపంచానికి తొలిసారిగా తెలిసివచ్చిందని తెలిపారు. సర్జికల్‌ స్ర్టైక్స్‌ జరపాలని మోడీ కేవలం 10 నిమిషాల్లోనే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పుల్వామా, యురి ఘటనలు రెండూ దురదృష్టకరమైనవేనన్న రాజ్‌నాథ్‌... సర్జికల్‌ స్ర్టైక్స్‌ జరపాలని పది నిమిషాల్లోనే మోడీ ఆదేశించడం ఆయన సంకల్ప శక్తికి నిదర్శనమన్నారు. జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొన్న తర్వాత సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాని తొలగిస్తామని రాజ్‌నాథ్‌ హామీనిచ్చారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్‌కు పెద్ద విషయమేమీ కాదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. కశ్మీర్‌ వంటి అంశాలపై మాట్లాడేందుకు బదులు.. ముందు మీ దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించుకోవాలని పాకిస్థాన్‌కు హితవు పలికారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత్‌కు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదన్న రాజ్‌నాథ్‌... భారత భూభాగంలో ఉన్నవారు ఎంత ప్రశాంత జీవనం సాగిస్తున్నారో పాక్‌ ఆక్రమణలో ఉన్న ప్రజలు చూస్తున్నారని అన్నారు. పీఓకే అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్‌లో అంతర్భాగమే’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా పీఓకేను ఆక్రమించుకోవడం వల్ల పాకిస్థాన్‌కు ఎటువంటి అధికారాలు ఉండవని.. ఇది భారత్‌లో అంతర్భాగమని పార్లమెంటు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్‌-అమెరికా దేశాలు కలిపి పనిచేస్తున్నాయని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఇరుదేశాలు సంయుక్తంగా నినదించాయని రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు. పాక్‌ భూభాగాన్ని ఉగ్రదాడులకు కేంద్రంగా ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. పాకిస్థాన్‌ ఉగ్ర మూకలకు కేంద్రంగా మారిందని ఆయన విమర్శించారు. పీఓకేలో పాక్ ప్రభుత్వం తీరు అసమంజసంగా, ఏకపక్షంగా, తప్పుదోవ పట్టించేదిగా ఉందని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story