Bharat: భారత్ గా మారనున్న ఇండియా?

Bharat: భారత్ గా మారనున్న ఇండియా?
విపక్షాలకు చెక్ పెట్టేందుకేనా?

ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు ఊపందుకునన్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగబోతున్న సంగతి తెలిసింది. ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ఈ కార్య క్రమంలో జీ20 దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది. భారత్ అనే పదాన్ని అందరికీ అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


రాష్ట్రపతి భవన్ పంపిన డిన్నర్ ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొనడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా బట్టబయలు చేశారు. ఇక నుంచి రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం మన దేశం పేరును భారత్ గా పిలవాల్సి ఉంటుందన్నారు. పేరు మార్చినప్పటికీ సమాఖ్య వ్యవస్థపై దాడి కొనసాగుతూనే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించడం, భారతదేశాన్ని విభజించడాన్ని మోదీ కొనసాగిస్తున్నారని, పేరు మార్పు కాదు భారత్ లో స్నేహం, సయోధ్య, నమ్మకాన్ని తీసుకురావడం ముఖ్యమని పేర్కొన్నారు.


అయితే జైరాం రమేశ్ ట్వీట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. భారత్ పేరును కాంగ్రెస్ అనవసరంగా వివాదాస్పదం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ గౌరవం, ప్రతిష్టకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు. భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేస్తున్న వారు “భారత్ మాతా కీ జై” నినాదాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారని నిలదీశారు.మరో వైపు దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న ప్రతిపాదనను అసోం సీఎం హిమంత బిస్వా శర్మ స్వాగతించారు. రిపబ్లిక్ ఆఫ్ భారత్- మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.


ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో... ఇండియా పేరును భారత్ గా మార్చేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది.


Tags

Read MoreRead Less
Next Story