Supreme Court: శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు మన దేశం ధర్మ సత్రం కాదు..

Supreme Court:  శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు మన దేశం  ధర్మ సత్రం కాదు..
X
శ్రీలంక పౌరుడి ఆశ్రయం పిటిషన్‌ను విచారించిన కోర్టు

భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులకు వసతి కల్పించడానికి ధర్మ సత్రం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పౌరుడి ఆశ్రయం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు దేశంలో ఆశ్రయం కల్పించవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ సెటిల్‌ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం అడిగింది. శ్రీలంకలో ఒకప్పుడు చురుకుగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధాలున్నాయనే అనుమానంతో 2015లో శ్రీలంక జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీపాంకర్ దత్తా, కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2018లో 10 ఏళ్ల శిక్ష వేసింది. అనంతరం అతడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కోర్టు మూడేళ్ల శిక్ష తగ్గించింది. ఏడేళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో ఆ శ్రీలంక పౌరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

చట్టబద్ధమైన వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్యాపిల్లలు ఈ దేశంలోనే సెటిల్‌ అయ్యారని చెప్పాడు. తనకూ ఇక్కడే ఆశ్రయం కల్పించాలని కోరాడు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పించాలా? ఇప్పటికే మా దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్‌ ధర్మశాల కాదు’’ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒక వేళ తన ప్రాణాలకు ముప్పు ఉంటే మరేదైనా దేశానికి వెళ్లాలని.. ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిందే అంటూ తేల్చి చెప్పారు.

Tags

Next Story