Russian Oil: రష్యా చమురుపై మోడీ-ట్రంప్ మధ్య అలాంటి సంభాషణే ఖండించిన భారత్

రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేసిందని.. ఈ మేరకు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ వాదనలను భారత్ ఖండించింది. ఈ విషయంపై ఇరువురు నేతల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని తెలిపింది. మోడీ- ట్రంప్ మధ్య ఈ మధ్య కాలంలో ఎలాంటి సంభాషణ జరగలేదని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇక ఇదే అంశంపై రష్యా కూడా స్పందించింది. భారత ప్రయోజనాలకు అనుగుణంగానే రెండు దేశాల మధ్య ఇంధన బంధం కొనసాగుతోందని స్పష్టం చేసింది.
రష్యా దగ్గర పాశ్చాత్య దేశాలు, భారతదేశం చమురు కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్‌పై యుద్ధం ఆగడం లేదని పదే పదే ట్రంప్ ఆరోపించారు. రష్యా ఆర్థికంగా బలపడడం వల్లే ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని.. లేదంటే భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అన్నట్టుగానే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. అలాగే చైనాపై 100 శాతం సుంకం విధించారు. అయితే తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేసినట్లు మోడీ తనకు చెప్పారని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది.
ఇక ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోడీ ట్రంప్‌కు భయపడుతున్నారని ఆరోపించారు. భారత్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ట్రంప్‌నకు మోడీ ధారాదత్తం చేసినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘కొన్ని రోజుల క్రితం వాణిజ్య ఒప్పందం ఎందుకు లేదని కాంగ్రెస్ అడగడం నేను విన్నాను. ఇది చుక్కాని లేని, నాయకుడు లేని, దిశానిర్దేశం లేని పార్టీ. కాంగ్రెస్ నిజంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేడు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్‌ను తమ నాయకుడిగా చూడటం లేదని, దేశ నాయకత్వాన్ని మర్చిపోతున్నాయని నేను అనుమానిస్తున్నాను.’’ అని గోయల్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com