మిస్ వరల్డ్ 2023 పోటీలకు భారత్ అతిథ్యం

మిస్ వరల్డ్ 2023 పోటీలకు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. 27 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలు ఈ ఏడాది భారత్‌లో జరుగుతున్నాయి. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జులియా మోర్లీ ప్రకటించారు. తుది తేదీలను ఇంకా ఖరారు చేయలేదని.. నవంబర్ లేదా డిసెంబర్‌లో మిస్వరల్డ్ పోటీలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నో ప్రత్యేకతలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారత్‌లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు మోర్లీ చెప్పారు. భారత్‌లో చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి.
దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ ప్రపంచ సుందరి పోటీల ఈవెంట్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించనున్నారు. అందాల పోటీల ప్రచారం కోసం ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న పోలండ్ బ్యూటీ, 2022 మిస్ వరల్డ్ విజేత కరోలినా బీలాస్కా సైతం హర్షం వ్యక్తం చేశారు. అందమైన భారతదేశంలో తన అందాల కిరీటాన్ని వేరొకరికి అప్పగించేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. భారత్‌లోని విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, గౌరవం, ప్రేమ, దయ.. వీటన్నింటినీ ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నామని కరోలినా బీలాస్కా అన్నారు.
ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ సుందరి టైటిల్‌ను భారత్ గతంలో ఆరుసార్లు గెలిచింది. 1966లో రీటా ఫరియా, 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లోప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఇప్పటి వరకు భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈసారి భారత్ తరఫున మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో సిని షెట్టి పాల్గొంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com