New Delhi: భారత్, శ్రీలంకల ఆర్థిక భాగస్వామ్యం

New Delhi: భారత్, శ్రీలంకల  ఆర్థిక భాగస్వామ్యం
విజన్‌ డాక్యుమెంట్‌కు ఆమోదం

శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రెండు రోజుల భారత పర్యటనలో గురువారం సాయంత్రం దిల్లీకి చేరుకున్న లంక ప్రధానికి. విమానాశ్రయంలో విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ స్వాగతం పలికారు. తాను భారత్‌కు వచ్చేముందు కీలక మంత్రిత్వశాఖ బాధ్యతలను తాత్కాలికంగా ఐదుగురు మంత్రులకు విక్రమసింఘె అప్పగించారు.

మిత్రదేశం శ్రీలంకతో ఎప్పటిలాగానే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళుల ఆకాంక్షలు నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘె ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరువురు నేతలు చర్చించారు. గత ఏడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడు తొలిసారి భారత్ వచ్చారు.

శ్రీలంకలో సంక్షోభం నెలకొన్న సమయంలో భారత్ అండగా నిలిచింది. దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక తోడ్పాటుతోపాటు ఔషధ సామగ్రి వంటి రూపాల్లో సాయం అందించిన భారత్ కు ఈ సందర్భంగా విక్రమసింఘె ధన్యవాదాలు తెలిపారు. భారత్ అభివృద్ధి పొరుగు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రణిల్ విక్రమసింఘె అన్నారు. దక్షిణ భారతదేశం నుంచి శ్రీలంకకు బహుళ-ప్రాజెక్ట్ పెట్రోలియం పైప్ లైన్ నిర్మాణం శ్రీలంకకు ఇంధన వనరులను అందిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాలకు సంబంధించిన సముద్ర జలాల్లో మత్స్యకారుల సమస్యనుమానవతా దృక్పథంతో పరిష్కరించాలని అంగీకరించినట్లు ప్రధాని మోదీ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story