2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశలో పయనిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితో 2047 నాటికి వికసిత్ భారత్ కల నెరవేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వందేళ్లలో ఒకసారి వచ్చే కరోనా మహమ్మారిని ఓడించామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో క్రమానుగుణ మార్పును సాధిస్తున్నామన్నారు. ఈ దశాబ్దం మార్పులు, సాంకేతికత, భౌగోళిక రాజకీయాలు సహా ఎన్నో అవకాశాలతో కూడుకున్నదని తెలిపారు. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకుని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక కీలక అడుగు అని అభిప్రాయపడ్డారు.
వికసిత్ భారత్@2047
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశంలో 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై తమ అభిప్రాయాలను పలు రాష్ట్రాల సీఎంలు వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి సహా ఇండియా కూటమి పార్టీలకు చెందిన సీఎంలు గైర్హాజరయ్యారు. విపక్షాల నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కరే హాజరైనా.. మీటింగ్ మధ్యలోనే ఆమె వాకౌట్ చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆమె బయటకు వచ్చారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com