India China Border: చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ..

India China Border: చైనా సరిహద్దుల్లో  ఉద్రిక్తతలు ..
10 వేల మందిభారత సైనికుల మోహరింపు

చైనాతో సుదీర్ఘ కాలం భారత్‌కు సరిహద్దు సమస్య కొనసాగుతోంది. ఈ క్రమంలోనే 2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లో గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భీకర సంఘర్షణతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రాజుకున్నాయి. దీంతో అప్పటి నుంచి భారత్ చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు మరింత తీవ్ర అయ్యాయి. ఈ ఘటనతో రెండు దేశాలు సరిహద్దుల్లో భారీగా సైన్యం, ఆయుధాల మోహరింపు, సైనిక చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు, భారీగా నిర్మాణాలు చేపట్టడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలోనే గతంలో పశ్చిమ సరిహద్దుల్లో మోహరించిన 10 వేల మంది సైనికులతో కూడిన బృందాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని సరిహద్దుల్లో మోహరించనుంది. ఈ మేరకు భారత సైనిక ఉన్నతాధికారులను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ గురువారం ఒక కథనాన్ని వెలువరించింది.

ఇప్పటికే చైనా బోర్డర్‌లో 9 వేల మంది సైనికులు ఉండగా.. వారికి అదనంగా ఈ కొత్త 10 వేల మందితో కూడిన సైన్యాన్ని మోహరించింది. చైనాతో సరిహద్దుల్లో ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సైన్యాన్ని మోహరించింది. చైనాతో సరిహద్దును పంచుకుంటున్న 532 కిలోమీటర్ల పొడవునా వీరు గస్తీ చేయనున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు భారత సైన్యం, రక్షణ శాఖ నిరాకరించినట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.

గత పదేళ్లలో ఈ 532 కిలోమీటర్ల సరిహద్దుల్లో భారీగా మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటకంగా కూడా భారీగా అభివృద్ధి చేశారు. చైనాతో సరిహద్దుల్లో గస్తీ కాసేందుకు 2021 లో భారత్ అదనంగా మరో 50 వేల మంది సైనికులను మోహరించింది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు అయ్యారు. ఇక చైనా వైపు భారీగా ప్రాణ నష్టం సంభవించిందని అంతర్జాతీయంగా నివేదికలు వెలువరించినా చైనా మాత్రం ఎక్కడా మృతుల సంఖ్యను వెలువరించలేదు.

Tags

Read MoreRead Less
Next Story