Jaishankar-Rubio: మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు

మలేషియా వేదికగా ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. మోడీ తరపున భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మలేషియాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను జైశంకర్ కలిశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై జైశంకర్-రూబియో చర్చించారు. ఈ మేరకు జైశంకర్ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.
ఇదిలా ఉంటే అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ ర్యాంకింగ్ సభ్యురాలు జీన్ షాహీన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం, ఇంధన భద్రత, చమురు, గ్యాస్ వాణిజ్యం గురించి చర్చించారు. ఇరు దేశాలకు సంబంధించిన కీలక చర్చలు జరిగినట్లుగా వినయ్ మోహన్ క్వాత్రా ఎక్స్‌లో తెలిపారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిని భారత రాయబారి క్వాత్రా పంచుకున్నారు.
మరోవైపు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు బాగా పురోగమిస్తున్నాయని, రెండు వైపులా చాలా అంశాలపై కమ్యూనికేట్ అవుతున్నాయని, పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందం ఆసన్నమైందని సూచించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మనం చాలా దగ్గరగా ఉన్నట్లు భావిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. భారత్‌పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ వేశారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. ఇలా మొత్తంగా భారత్‌పై 50 శాతం సుంకం పడింది. అయితే రష్యాతో సంబంధాలు తెంచుకుంటే సుంకాలు తగ్గిస్తామని అమెరికా అంటోంది. ప్రస్తుతం రష్యా దగ్గర చమురు కొనుగోలు తగ్గించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు మలేషియా వేదికగా జైశంకర్-రూబియో మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

