INDIAN ARMY: భారత్ జోలికొస్తే ఊచకోతే..!

భారత సైనిక వ్యవస్థలో ఒక కీలకమైన మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడం, త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) మధ్య సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ల ఏర్పాటు దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2019లోనే ఈ సంస్కరణలకు బీజం వేశారు.
ఉమ్మడి పోరాటానికి పద్మవ్యూహం
ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వేర్వేరు కమాండ్ల కింద పనిచేస్తున్నాయి. కొత్త థియేటర్ కమాండ్ వ్యూహం ప్రకారం, ఒకే భౌగోళిక ప్రాంతం కోసం, ఈ మూడు దళాల ఆస్తులు, వనరులు అన్నీ ఒకే కమాండర్ ఆధ్వర్యంలోకి వస్తాయి. దీనివల్ల యుద్ధ సమయాల్లో లేదా ఇతర కార్యకలాపాల్లో వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన సమన్వయం సాధ్యమవుతుంది. శత్రు దేశాలకు అంతుచిక్కని పద్మవ్యూహంలా ఇది పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వనరులు, లాజిస్టిక్స్, శిక్షణ వంటి వాటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చు కూడా ఆదా అవుతుంది.
సమన్వయం కోసం తొలి అడుగులు
ఈ సంస్కరణలపై త్రివిధ దళాల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు కృషి జరుగుతోంది. తొలి దశలో, తిరువనంతపురం, విశాఖపట్నం, గాంధీనగర్‌లలో 3 ఉమ్మడి మిలటరీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్రివిధ దళాల సిబ్బంది కలిసి శిక్షణ పొందేందుకు, సహకరించుకునేందుకు ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా, ఇండియన్ నేవీ నేతృత్వంలో కేరళలోని తిరువనంతపురంలో మారిటైమ్ థియేటర్ కమాండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇది సముద్ర సరిహద్దుల భద్రతను పర్యవేక్షిస్తుంది. సైన్యంలో ఈ నిర్మాణాత్మక సంస్కరణ సమైక్యతను పెంచి, భద్రతాపరమైన ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు దోహదపడుతుంది. ఇది భారత రక్షణ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ సంస్కరణల ద్వారా, భారత సైన్యం మల్టీ-డొమైన్ వార్ఫేర్కు సిద్ధమవుతుంది. సైబర్, స్పేస్ వంటి కొత్త పోరాట సామర్థ్యాలను కూడా ఈ కమాండ్ల కిందకు తీసుకురానున్నారు. రెండు దశాబ్దాలుగా చర్చల్లో ఉన్న ఈ సంస్కరణలు, పెరుగుతున్న పాక్, చైనా ముప్పుల నేపథ్యంలో ఇప్పుడు అత్యంత ఆవశ్యకంగా మారాయి.
మంచు తుఫానులో చిక్కుకున్న 1000 మంది
మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుఫాన్ సంభవించింది. దీంతో ట్రెక్కింగ్‌లో ఉన్న 1000 మంది తుఫానులో చిక్కుకున్నారు. వీరిలో భారతీయులు, చైనీయులు, అమెరికన్లు సహా ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. టిబెట్ వైపు ఉన్న ఎవరెస్ట్ తూర్పు భాగంలో తీవ్ర మంచు తుఫాను వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 350 మంది రక్షించినట్టు వెల్లడించారు. హెలీకాప్టర్లు, ట్రెక్కింగ్ బృందాల సహాయంతో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com