Helicopter Crash: కేరళలో ఘోర ప్రమాదం, రన్‌వేపై క్రాష్ అయిన నేవీ హెలికాప్టర్

భారత నావికాదళానికి చెందిన శిక్షణ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో నేవీ అధికారి ఒకరు దుర్మరణం పాలైనట్టుగా తెలిసింది.. కేరళలోని కొచ్చిలో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇండియన్ నేవికి చెందిన చేతక్ హెలికాప్టర్ కొచ్చిలోని నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ గరుడ రన్ వే పై కుప్పకూలింది. జరిగిన ఘటనలో పైలట్ సహా మరో ఇద్దరికి గాయపడ్డారని తెలిసింది. నావికుడు మృతి పట్ల నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, సీడీఎస్ అనిల్ చౌహాన్ సంతాపం తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి విచారణ బోర్డును ఆదేశించినట్లు భారత నౌకాదళం తెలిపింది. నేవీ వర్గాల సమాచారం ప్రకారం.. నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ రన్‌వేపై హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యోగేంద్ర సింగ్ అనే నావికుడు మరణించాడు. యోగేంద్ర మధ్యప్రదేశ్ నివాసి. “కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ వద్ద నిర్వహణ తనిఖీల సమయంలో చేతక్ హెలికాప్టర్ ఈరోజు కూలిపోయింది, ఫలితంగా నావికాదళ సిబ్బంది మరణించారు” అని నేవీ క్లుప్త ప్రకటనలో తెలిపింది. నేవల్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఇండియన్ నేవీ సిబ్బంది అందరూ యోగేంద్ర సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి ఆయనకు నివాళులర్పించినట్లు నేవీ తెలిపింది. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా నావికుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com