DRDO: ఎంఐజీఎం పరీక్ష విజయవంతం, పెరిగిన భారత నేవీ సత్తా

భారత నౌకాదళం మరింత శత్రుభీకరంగా రూపుదిద్దుకోనుంది. జలమార్గంలో శత్రువుల కుట్రల్ని దీటుగా తిప్పికొట్టేలా డీఆర్డీవో-నేవీ సంయుక్తంగా అధునాతన వ్యవస్థను అభివృద్ధి చేశాయి. దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన మల్టీ ఇన్‌ఫ్లూయెన్స్ గ్రౌండ్ మైన్ (ఎంఐజీఎం) పరీక్ష విజయవంతమైంది. విశాఖ కేంద్రంగా చేపట్టిన ఈ పరీక్ష విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో, నేవీ పనితీరును అభినందించారు. ఈ వ్యవస్థ భారత నావికాదళం సముద్ర గర్భంలో పోరాట సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందని పేర్కొన్నారు.
అధునాతన సముద్రగర్భ నావల్ మైన్‌ను విశాఖలోని నావల్ సైన్స్ అండ్ టెక్నోలాజికల్ లేబోరేటరీ.. భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(DRDO) లేబోరేటరీలు, పుణెలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చి లేబోరేటరీ, చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చి లేబోరేటరీల సహకారంతో అభివృద్ధి చేశారు. శత్రు నౌకలు, జలంతర్గాములకు వ్యతిరేకంగా భారత నావికా దళం సామర్థ్యాలను ఇది మరింత బలోపేతం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీనికి విశాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్ ఉత్పత్తి భాగస్వాములుగా ఉన్నాయి. తాజా పరీక్షతో ఈ వ్యవస్థ ఇప్పుడు భారత నేవీ దళంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com