Ashley J Tellis: అమెరికాలో భారత సంతతి రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అరెస్ట్

అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ వ్యూహకర్త యాష్లీ జె టెల్లిస్‌ను ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా తన వద్ద ఉంచుకున్నారనే తీవ్రమైన ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వర్జీనియా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది.
64 ఏళ్ల టెల్లిస్, వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత 'కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్' సంస్థలో సీనియర్ ఫెలోగా, టాటా చైర్ ఫర్ స్ట్రాటజిక్ అఫైర్స్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ రహస్య మెటీరియల్ నిర్వహణపై ఫెడరల్ దర్యాప్తు జరిపిన అనంతరం, గత వారాంతంలో టెల్లిస్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. రక్షణ సంబంధిత పత్రాలను అనధికారికంగా కలిగి ఉండటాన్ని నిషేధించే 18 యూఎస్సీ 793(e) చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.
ఈ కేసులో మరో కీలక కోణం కూడా వెలుగులోకి వచ్చింది. టెల్లిస్ సురక్షిత ప్రాంతాల నుంచి రహస్య పత్రాలను తొలగించారనే ఆరోపణలతో పాటు, చైనా అధికారులతో సమావేశమయ్యారనే విషయంపై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
ఈ అరెస్ట్‌పై యూఎస్ అటార్నీ లిండ్సే హల్లిగాన్ స్పందిస్తూ... "ఈ ఆరోపణలలోని ప్రవర్తన మన పౌరుల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది" అని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో టెల్లిస్‌పై నేరం రుజువైతే, అతనికి పదేళ్ల వరకు జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానాతో పాటు స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను ప్రభుత్వం జప్తు చేసే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, కోర్టులో నేరం రుజువయ్యే వరకు టెల్లిస్‌ను నిర్దోషిగానే పరిగణించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com