Omicron New Variant: కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌పై వైద్యుల పరిశోధనలు.. వ్యాప్తి అధికంగా ఉంటుందంటూ..

Omicron New Variant: కరోనా కేసులు తగ్గుముఖం పడుతోందనుకుంటున్న వేళ.. కొత్త వేరియంట్‌లు కలవరపెడుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కన్నా పది శాతం వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్ ఇండియాలోనూ బయటపడింది. ఒమిక్రాన్ XE రకం కరోనా వైరస్‌ను ముంబైలో గుర్తించినట్లు BMC స్పష్టంచేసింది. మొత్తం 230 శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. ఒకరిలో XE, మరొకరిలో కప్పా వేరియంట్ గుర్తించినట్లు చెప్పారు.
భారత్‌లో కొంతకాలంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ BA.1, ఒమిక్రాన్ BA.2 వేరియంట్ల కలయికతో ఒమిక్రాన్ XE వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. BA.2 వేరియంట్‌తో పోల్చితే XE వేరియంట్...9.8 శాతం అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంచనా వేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. XE వేరియంట్ గుర్తించిన 50 ఏళ్ల పేషంట్ ఫిబ్రవరిలో సౌతాఫ్రికా నుంచి తిరిగివచ్చిందన్నారు.
మార్చి 2న కరోనా పాజిటివ్‌గా వచ్చిందన్నారు అధికారులు. XE వేరియంట్ ఈ ఏడాది ప్రారంభంలో యూకేలో తొలిసారిగా గుర్తించినట్లు చెప్పారు అధికారులు. జనవరి 19న XE వేరియంట్ తొలి కేసును గుర్తించినట్టు తెలిపిన యూకే అధికారులు.. ఇప్పటివరకూ 637 మందికి XE వేరియంట్ సోకిందన్నారు. ముంబైలో గుర్తించిన వేరియంట్ XE అనడానికి తగిన ఆధారాలు లేవంటొంది కేంద్రం. XE వేరియంట్‌గా భావిస్తున్న శాంపిల్ ఫాస్ట్ క్యూ ఫైల్స్‌ను...ఇన్‌సాగ్‌కు చెందిన జన్యు నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. ఈ శాంపిల్ జీనోమ్ సీక్వెన్స్....XE వేరియంట్‌తో సరిపోలడం లేదని ఆయా వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com