Pharma Exports : ఫార్మా రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. దిగుమతుల కంటే ఎగుమతులే టాప్.

Pharma Exports : ఫార్మా రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. దిగుమతుల కంటే ఎగుమతులే టాప్.
X

Pharma Exports : భారతదేశం త్వరలోనే ప్రపంచపు ఫార్మసీగా ఎదగడమే కాకుండా, మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల విషయంలో కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా రాజ్యసభలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఏపీఐ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 41,500 కోట్లుగా నమోదయ్యాయి.

దిగుమతుల కంటే ఎగుమతులే ఎక్కువ

సాధారణంగా భారత్ మందుల తయారీ కోసం చైనా వంటి దేశాల నుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుందనే టాక్ ఉంది. కానీ జేపీ నడ్డా సమర్పించిన డేటా ప్రకారం.. మనం దిగుమతి చేసుకుంటున్న విలువ కంటే ఎగుమతి చేస్తున్న విలువే ఎక్కువగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.39,215 కోట్ల విలువైన ఏపీఐలను దిగుమతి చేసుకోగా, అంతకంటే ఎక్కువగా అంటే రూ.41,493 కోట్ల విలువైన పదార్థాలను ఇతర దేశాలకు పంపాము. చైనా నుంచి దిగుమతులు కొంత పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ (70% నుంచి 74%కి), దేశీయంగా ఉత్పత్తిని పెంచడంలో భారత్ సక్సెస్ అవుతోంది.

PLI స్కీమ్‌తో ఊపందుకున్న తయారీ

భారతదేశాన్ని ఫార్మా రంగంలో ఆత్మనిర్భర్(స్వయం సమృద్ధి)గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం రూ.6,940 కోట్ల భారీ కేటాయింపులతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 41 రకాల కీలక ముడి పదార్థాల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో ఇప్పటికే 28 రకాల ఉత్పత్తుల తయారీ కోసం ఏటా 56,800 టన్నుల సామర్థ్యం గల యూనిట్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతోంది.

ఉపాధి, విదేశీ మారక ద్రవ్యం ఆదా

డిసెంబర్ 2025 నాటికి అందిన సమాచారం ప్రకారం, ఈ పథకం ద్వారా సుమారు రూ.2,720 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఇందులో రూ.527.96 కోట్ల విలువైన ఎగుమతులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్కీమ్ వల్ల సుమారు రూ.2,192 కోట్ల విలువైన దిగుమతులను మనం అరికట్టగలిగాము. అంటే ఆ మొత్తం విదేశీ కరెన్సీ మన దేశంలోనే మిగిలింది. అంతేకాకుండా ఈ రంగంలో కొత్తగా 4,896 మందికి ఉపాధి లభించింది. మార్కెట్‌ను కాపాడటానికి ప్రభుత్వం యాంటీ-డంపింగ్ డ్యూటీ వంటి చర్యలు కూడా తీసుకుంటోందని మంత్రి వివరించారు.

Tags

Next Story