Red Road in MP: దేశంలోనే ఫస్ట్ రెడ్ రోడ్.. మరి కార్లలోని ADAS సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుందా?

Red Road in MP: మధ్యప్రదేశ్‌లో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి రెడ్ రోడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రోడ్డు భద్రత. అత్యాధునిక కార్లలో ఉండే అడాస్ టెక్నాలజీ నేపథ్యంలో ఈ రోడ్డుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా నలుపు రంగులో ఉండే రోడ్లకు భిన్నంగా, దుబాయ్ తరహాలో NH-45 హైవేపై అడవి గుండా వెళ్లే సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ రెడ్ రోడ్ ని నిర్మించారు. థర్మోప్లాస్టిక్ మార్కింగ్‌తో రూపొందించిన ఈ రహదారి కేవలం చూడటానికి అందంగా ఉండటమే కాదు, దీని వెనుక వన్యప్రాణుల రక్షణ, డ్రైవర్ల భద్రత అనే బలమైన కారణాలు ఉన్నాయి.
స్పీడ్ బ్రేకర్ల బాధ ఉండదు
ఈ రెడ్ రోడ్ సాధారణ స్పీడ్ బ్రేకర్లలాగా వాహనాన్ని కుదిపేయదు. ఇది రోడ్డుపై స్వల్పంగా ఎత్తుగా ఉండి, దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తుంది. ఎరుపు రంగును చూడగానే డ్రైవర్లు అప్రమత్తమై ఆటోమేటిక్‌గా వేగాన్ని తగ్గిస్తారు. దీనివల్ల అడవి ప్రాంతాల్లో హఠాత్తుగా జంతువులు అడ్డువచ్చినా ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి వాహనాలకు కూడా ఎలాంటి నష్టం జరగదు. డ్రైవర్లు ఎంతో ప్రశాంతంగా ఈ రహదారిపై ప్రయాణించవచ్చు.
ADAS సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుందా?
కొత్త టెక్నాలజీ కార్లలో ఉండే అడాస్ సిస్టమ్ ఈ రంగును చూసి తికమకపడుతుందా? అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే దీనిపై నిపుణులు భరోసా ఇస్తున్నారు. అడాస్ టెక్నాలజీ కేవలం రోడ్డు రంగుపై మాత్రమే ఆధారపడదు. అది రోడ్డుకు ఇరువైపులా ఉండే తెల్లటి లేదా పసుపు రంగు లేన్ లైన్లను, కెమెరాలు, రాడార్, లిడార్ సెన్సార్ల ద్వారా గుర్తించి పనిచేస్తుంది. రోడ్డుపై ఉండే ఎర్రటి రంగును అది కేవలం రోడ్డు ఉపరితలంగానే గుర్తిస్తుంది. ఒకవేళ లేన్ లైన్లు సరిగ్గా లేకపోతే మాత్రమే సిస్టమ్ డ్రైవర్‌ను నియంత్రణ తీసుకోమని హెచ్చరిస్తుంది తప్ప, ఎర్రటి రంగు వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని టాటా టెక్నాలజీస్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు.
దుబాయ్ స్ఫూర్తితో.. జంతువుల రక్షణ కోసం!
దుబాయ్‌లోని ప్రఖ్యాత షేక్ జాయెద్ రోడ్ నుంచి స్పూర్తి పొంది ఈ ప్రాజెక్టును చేపట్టారు. అక్కడ ఇలాంటి రంగుల రోడ్ల వల్ల ప్రమాదాల శాతం గణనీయంగా తగ్గింది. భారత రోడ్డు రవాణా శాఖ ఈ ప్రయోగాన్ని అడవి ప్రాంతాల్లో చేపట్టడానికి ముఖ్య కారణం వన్యప్రాణుల రక్షణే. ఈ రెడ్ రోడ్ల డ్రైవర్లకు ప్రమాద హెచ్చరికగా కాకుండా, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ కు సంకేతంగా నిలుస్తుంది. భవిష్యత్తులో దేశంలోని మరిన్ని అటవీ ప్రాంతాల్లో ఇలాంటి రహదారులను మనం చూసే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

