దేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్..

దేశ ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద డీల్ జరిగింది. దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో 500 విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి నేరో బాడీ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. టాటాలకు చెందిన ఎయిరిండియా ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాల ఆర్డర్ దేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్ కాగా తాజాగా దాన్ని ఇండిగో అధిగమించింది.
ప్రస్తుతం ఇండిగో 300 విమానాలను నడుపుతోంది. ఇది వరకే 480 విమానాలకు ఆర్డర్ పెట్టింది. ఇవి డెలివరీ అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే 2030-2035 మధ్య డెలివరీ కోసం మరో 500 విమానాలకు ఇండిగో ఆర్డర్ పెట్టింది. మొత్తంగా రానున్న దశాబ్ద కాలంలో ఇండిగో ఆర్డర్ బుక్‌లో ఉన్న వెయ్యి వరకు విమానాలు డెలివరీ కావాల్సి ఉందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా ఆర్డర్ చేసిన విమానాల్లో ఏ320 నియో, ఏ321 నియో, ఏ321 XLR విమానాలు ఉన్నాయి. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలేవీ తెలియరానప్పటికీ.. దీని విలువ సుమారు 50 బిలియన్ డాలర్లు ఉంటుందన్నది అంచనా.
కొవిడ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న విమానయాన పరిశ్రమ మళ్లీ అంతేవేగంగా కోలుకుంది. విమాన ప్రయాణాలు భారీగా పుంజుకున్నాయి. దీంతో విమానయాన సంస్థలు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున విమానాలను ఆర్డర్ పెడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇండిగో 500 విమానాలను కొనుగోలుకు ఆర్డర్ పెట్టడం గమనార్హం. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 56 శాతం వాటా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com