IndiGo : షేర్ మార్కెట్‌లో ఇండిగో సునామీ.. రాకెట్లా దూసుకుపోనున్న షేర్లు.

IndiGo : దేశంలోనే అతిపెద్ద తక్కువ ధరల విమానయాన సంస్థ ఇండిగో పరిస్థితి ప్రస్తుతం కాస్త మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వందలాది విమానాలు రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోందని కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఆదివారం తాము దాదాపు 1,650 విమానాలను విజయవంతంగా నడిపామని సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఈ సానుకూల ప్రకటన కారణంగా గత వారం 9 శాతం పతనమైన కంపెనీ షేర్లలో సోమవారం పెరుగుదల కనిపించవచ్చని అంచనా.
ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్, సిబ్బందికి ఇంటర్నల్ వీడియో మెసేజ్ విడుదల చేస్తూ, పరిస్థితిని వివరించారు. శనివారం 1,500 విమానాలు, శుక్రవారం కేవలం 700 కంటే కొంచెం ఎక్కువ విమానాలు మాత్రమే నడిచిన ఇండిగో, ఆదివారం దాదాపు 1,650 విమానాలను నిర్వహించింది. ఆదివారం నాటికి సమయానికి బయలుదేరే విమానాల పనితీరు 75 శాతం ఉండవచ్చని ఎల్బర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణీకులు ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ఇప్పుడు విమానాలను మొదటి దశలోనే రద్దు చేస్తున్నట్లు సీఈఓ వివరించారు. డిసెంబర్ 7 నాటికి, ఇండిగో 138 గమ్యస్థానాలలో 137 వద్ద కార్యకలాపాలను పునరుద్ధరించింది.
విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ఇబ్బంది పడిన ప్రయాణీకులకు రిఫండ్, మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం, ఇండిగో చర్యలు తీసుకున్నాయి. ఇండిగో ఇప్పటివరకు రద్దు చేయబడిన లేదా ఆలస్యమైన విమానాలకు సంబంధించి రూ.610 కోట్ల రిఫండ్‌ను ప్రాసెస్ పూర్తి చేసింది. శనివారం నాటికి ప్రయాణీకుల 3,000 మిస్ అయిన లగేజీని వారికి చేర్చారు. రద్దు చేసిన టికెట్ల రిఫండ్‌ను ఆదివారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని, లగేజీని 48 గంటల్లో చేర్చాలని ప్రభుత్వం ఇండిగోకు ఆదేశాలు ఇచ్చింది. రద్దు అయిన విమానాల ప్రయాణీకుల టికెట్ల పునర్నిర్ధారణకు ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబడదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత వారం ఇండిగో షేర్లు 9 శాతం పడిపోయాయి. శుక్రవారం BSEలో షేర్ ధర 1.22 శాతం తగ్గి రూ.5371.30 వద్ద ముగిసింది. అయితే, ప్రస్తుత సానుకూల ప్రకటన, రిఫండ్‌ల ప్రక్రియ కారణంగా సోమవారం ఇండిగో షేర్లలో పెరుగుదల కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

