సరిహద్దులో ఉద్రిక్తతలు.. డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి..

సరిహద్దులో ఉద్రిక్తతలు.. డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి..
సరిహద్దులో భారత్‌- చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల..

సరిహద్దులో భారత్‌- చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద సెగలు రగులుతూనే ఉన్నాయి. గత నెల 29 అర్ధరాత్రి.. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరాన్ని ఆక్రమించేందుకు డ్రాగన్‌ కంట్రీ కుట్ర పన్నింది. ఐతే చైనా సైన్యాల దురాక్రమణను విఫలం చేసిన భారత బలగాలు.. ముందు జాగ్రత్తగా తన వ్యూహాన్ని సమూలంగా మార్చేసింది. లద్దాఖ్‌లోని 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వద్ద 'సరిహద్దు నిర్వహణ' మాత్రమే చేపట్టే భారత్‌.. ఇప్పుడు 'సరిహద్దు రక్షణ'కు పూనుకుంది. చైనా ఎలాంటి దుస్సాహసానికి దిగినా సరిహద్దును కాపాడుకునేలా పటిష్ఠంగా వ్యూహాన్ని సిద్ధం చేసింది. వ్యూహాత్మకంగా డ్రాగన్‌ కన్నా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మన బలగాలు మోహరించాయి. ఒకవేళ చైనా సైన్యాలు తోక జాడిస్తే.. ప్రతిదాడి చేసేందుకు ఈ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. దీంతో పాటు ఎత్తు ప్రాంతాల్లో ఉండడం వల్ల ప్రత్యర్థుల కదలికలను.. పసిగట్టడం కూడా సులువుగా ఉంటుంది..

ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్‌-4 పర్వతాలు చైనా కబ్జాలో ఉన్నాయి. దీంతో చైనా ఎత్తును చిత్తు చేసేందుకు భారత్‌ పైఎత్తు వేసింది. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవు భాగంలో ఎత్తయిన వ్యూహాత్మక ప్రాంతాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఫింగర్‌-4 ప్రాంతంలోనూ ఇతర పర్వత శిఖరాలను ఆకస్మికంగా తన అధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్‌పై భారత్‌ ఒత్తిడి పెంచింది. తద్వారా భవిష్యత్‌లో చర్చలు జరిపేటప్పుడు భారత్‌కు అనుకూల పరిస్థితి ఉంటుందని సైనిక వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లోకి చైనా ఇబ్బడిముబ్బడిగా బలగాలను తరలిస్తున్న నేపథ్యంలో భారత్‌ దీటుగా స్పందిస్తోంది. ప్రత్యేకంగా సిద్ధంచేసిన 'స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌' సహా అనేక విభాగాలను రంగంలోకి దించింది. ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఐనా ప్రత్యేర్థులను ఎదుర్కొనే సామర్ధ్యం ఈ దళాలకు ఉంటుంది. ఇప్పుడు దెమ్‌చోక్‌, చుమార్‌ ప్రాంతంలో భారత్‌దే పైచేయిగా ఉంది.

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ MM నరవణె రెండు రోజుల పర్యటన కోసం లద్దాఖ్‌ చేరుకున్నారు. సరిహద్దు శిబిరాన్ని సందర్శించి బలగాలతో ముచ్చటించారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను సైనిక కమాండర్లు ఆయనకు వివరించారు. ఇప్పటికే వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌.భదౌరియా తూర్పు విభాగంలోని పలు కీలక వైమానిక స్థావరాలను సందర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలలోని ఎల్‌ఏసీ వెంబడి వాయుసేన పోరాట సన్నద్ధతపై సమీక్ష జరిపారు. మన వాయు సేన ఇప్పటికే తనవద్ద ఉన్న సుఖోయ్‌-30 ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌-2000 తదితర అగ్రశ్రేణి యుద్ధవిమానాలు, అపాచీ, చినూక్‌ వంటి హెలికాప్టర్లను మోహరించింది. భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే ఎస్‌ఎస్‌బీ దళాలను అరుణాచల్‌ ప్రదేశ్‌, భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లోకి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చై నా దురుసు చర్యలకు దీటుగా స్పందించే సత్తా భారత సైనిక దళాలకు ఉందని త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టంచేశారు.

Tags

Next Story