మహా సీఎం షిండే ఖేల్‌ ఖతమైనట్లేనా..?

మహా సీఎం షిండే ఖేల్‌ ఖతమైనట్లేనా..?
షిండేను సైడ్‌ చేసి ముఖ్యమంత్రి పీఠంపై అజిత్‌ పవార్‌ను కూర్చోబెట్టే ఆలోచనలో సర్కారు

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఖేల్‌ ఖతమైనట్లేనా షిండేను సైడ్‌ చేసి ముఖ్యమంత్రి పీఠంపై అజిత్‌ పవార్‌ను కూర్చోబెడతారా మహా రాజకీయాల్లో ఇప్పుడీ ప్రచారం సంచలనం రేపుతోంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌ షిండే సహా ఆయన వర్గానికి చెందిన మొత్తం 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి NCP నేత అజిత్‌ పవార్‌కు మహారాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.మహారాష్ట్రలో జరిగిన నాటకీయ పరిణామాల వెనుక బీజేపీ అసలు వ్యూహం ఇదేనా అనే అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.మరాఠా నేత అయిన షిండేను శివసేన నుంచి తీసుకొచ్చి సీఎంగా చేసిన బీజేపీ ఇప్పుడు అంతకంటే బలమైన మరాఠా నేతకు పగ్గాలు అప్పగించి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.మరోవైపు 16 మంది షిండే వర్గ ఎమ్మెల్యేలపై స్పీకరు ఆగస్టు 11 లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఈ నేపథ్యంలో షిండేను తప్పించి అజిత్‌కు పగ్గాలు అప్పగించాలని బీజేపీ స్కెచ్‌ వేసిందని అంటున్నారు.

NCPని చీల్చి అజిత్‌ పవార్‌ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో తలెత్తిన పరిణామాలపై శివసేన ఉద్ధవ్‌ పత్రిక సామ్నా ప్రచురించిన ఎడిటోరియల్‌ సంచలనం సృష్టించింది. త్వరలోనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే స్థానాన్ని అజిత్‌ పవార్‌ భర్తీ చేస్తారని సామ్నా పేర్కొంది.శివసేనను చీల్చి బయటకు వచ్చిన వారిలో 16 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారంది.ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల నేతృత్వంలోని బీజేపీ మహారాష్ట్రలోనే కాదు దేశంలోని రాజకీయాలనే బురదమయం చేసిందని ఆరోపించింది.రానున్న రోజుల్లో సీఎం ఏక్‌నాథ్‌ షిండేను అజిత్‌ పవార్‌ భర్తీ చేస్తారన్న సామ్నా ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పవార్‌ ఈ కూటమితో కలిశారనుకోవడం లేదని పేర్కొంది. షిండే, ఆయన మద్దతుదారులపై త్వరలో అనర్హత వేటు పడుతుందని పవార్‌కు పట్టాభిషేకం చేస్తారని రాష్ట్రంలో ఇదివరకు ఇలాంటి సంప్రదాయం లేదంటూ సామ్నా ఫైర్ అయ్యింది.అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో రికార్డు సృష్టించారని వ్యాఖ్యానించింది. గతంలోని కాంగ్రెస్‌, బ్రిటిష్‌ హయాంలే మేలని, వారు ధైర్యంగా వీధుల్లోకి వచ్చి పోరాడేవారని,ఇలా దొంగ దెబ్బ తీసేవారు కాదని ఘాటుగా విమర్శించింది. అయితే ఈ వాదనల్ని బీజేపీ తోసిపుచ్చింది.

మహారాష్ట్రలోని 48 లోక్‌సభ సీట్లలో 45 వరకూ గెలవాలని కోరుకుంటున్న బీజేపీ అది షిండే వల్ల సాధ్యం కాదని భావిస్తోందట.షిండేను తీసుకొచ్చినప్పుడు మరాఠా కార్డును వాడిన బీజేపీకి ఇప్పుడు మరో బలమైన మరాఠా నేత అజిత్‌ పవార్‌ రూపంలో దొరికారని షిండే కంటే అజిత్‌ బాగా ఎన్నికల్లో ప్రభావం చూపగలరని బీజేపీ నమ్ముతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సుప్రీంకోర్టు సూచనల మేరకు ఆగస్టు 11లోగా సీఎం షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడ్డా బీజేపీ కూటమికి వచ్చే నష్టం ఏమీ లేదంటున్నారు.రాజ్‌భవన్‌కు సమర్పించిన లేఖ ప్రకారం అజిత్‌ పవార్‌కు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, బీజేపీకి ఇప్పటికే 105 మంది సభ్యులున్నారని, మెజారిటీకి అవసరమైన 145 మంది మద్దతు సులభమేనని చెబుతున్నారు.అప్పుడు షిండే వర్గం ఎమ్మెల్యేల మద్దతూ అవసరం లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Tags

Read MoreRead Less
Next Story