Project cheetha: చీతాల మరణానికి..రేడియో కాలర్సే కారణమా..

Project cheetha: చీతాల మరణానికి..రేడియో కాలర్సే కారణమా..
X
వన్యప్రాణి సంరక్షణలో భాగంగా చీతాలకు అమర్చిన రేడియో కాలర్స్ కారణంగా అవి మృతి చెందాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల వరుస మరణాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ స్పందించింది. సహజ కారణాల వల్లనే చీతాలు మృతి చెందాయని తెలిపింది. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా చీతాలకు అమర్చిన రేడియో కాలర్స్ కారణంగా అవి మృతి చెందాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలానే శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని కోరింది. చీతా ప్రాజెక్ట్‌లో భాగంగా వాటి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఇక ఇందులో భాగంగా చీతా రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకొచ్చిన 20 చీతాల్లో ఐదు చీతాలు మృతి చెందాయి. ప్రాజెక్ట్ చీతా నిర్వహణ కోసం కేంద్రం నియమించిన కమిటీ చీతాల పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తుందని, ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే ఉన్నందున జయాపజయాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చెప్పారు. కొద్దిరోజుల క్రితం వారం వ్యవధిలో రెండు చీతాలు మరణించడంతో.. కొందరు అంతర్జాతీయ చీతా నిపుణులు వాటికి అమర్చిన రేడియో కాలర్స్ వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి మృత్యువాత పడుతున్నాయనే సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా గత 25 సంవత్సరాలుగా రేడియో కాలర్స్ ఉపయోగిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రేడియో కాలర్స్ వల్ల ఏ వన్యప్రాణికి ఇన్ఫెక్షన్ సోకిన దాఖలాలు లేవన్నారు. ఒకవేళ, అదే నిజమైతే ఈ విషయాన్ని రేడియో కాలర్స్ తయారీదారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. చీతాల మృతికి సంబంధించి నివేదిక రాకుండా ముందే ఒక నిర్ణయానికి రావడం సరైంది కాదన్నారు.

Tags

Next Story