India: భారత్‌పై ఐస్లామిక్ స్టేట్ ఉగ్ర గురి.. పాక్ నుంచి టెలిగ్రామ్‌లో వీడియో..

India: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ... భారత్‌పై గురిపెట్టింది. భారత్‌లో విధ్వంసాలు, ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా జోరుగా రిక్రూట్‌మెంట్లు చేస్తోంది. ఈమేరకు ఐఎస్ స్వయంగా ప్రకటించింది. ఐఎస్-ఖలీప్ పేరుతో ఏకంగా ఓ వీడియోను విడుదల చేసింది. భారత్‌లో ఐఎస్-ఖలీప్, ఐఎస్-జేకే, ఐఎస్-హింద్ ప్రావిన్స్ పేరిట యాక్టివ్‌గా ఉన్నాయని, యువత రిక్రూట్‌మెంట్లు సాగుతున్నాయని పేర్కొంది.
ఈ వీడియాలో ముగ్గురు ఉగ్రవాదులు ముసుగులు ధరించి కనిపించారు. నిఘా వర్గాలు తమను గుర్తించకుండా వారు తమ కళ్లు స్పష్టంగా కనిపించకుండా చేశారు. కొందరు యువకులు పిస్టళ్లు, రివాల్వర్లు వంటి ఆయుధాలతో శిక్షణ పొందుతున్న దృశ్యాలున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఈ వీడియోను విశ్లేషించాయి.
గతంలో ఐఎఎస్-జేకే విడుదల చేసిన వీడియోకు ప్రస్తుత ఐఎస్-ఖలీప్ విడుదల చేసిన వీడియోకు పోలికలున్నట్లు నిర్ధారించారు. ఇది జమ్మూకాశ్మీర్‌లో చిత్రీకరించినదేనని పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లో తనిఖీలు, కార్డాన్ అండ్ సెర్చ్ ముమ్మరం కావడంతో మిలిటెంట్లు, ఉగ్రవాదులు ఏకే-47 వంటివి కాకుండా రివాల్వర్లు, పిస్టళ్లనే వినియోగిస్తున్నారు.
ఐఎస్‌తో హైదరాబాద్ పాతబస్తీకి సంబంధాలున్నట్లు ఇప్పటికే తేలింది. 2015లో చాంద్రాయణగుట్ట రియాసత్‌నగర్‌కు చెందిన ఐఎస్ ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్ అరెస్టుతో నగరంలో ఐఎస్-అబుధాబి మాడ్యుల్ మూలాలు బయటపడ్డాయి. అంతకుముందు కూడా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కొందరు పట్టుబడ్డారు. 2019 ఏప్రిల్ 20న హైదరాబాద్ కింగ్స్ కాలనీలో ఎన్‌ఐఏ సోదాలు జరిపి నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు హన్స్‌లను అరెస్టు చేసింది.
వీరంతా ఐఎస్ అనుబంధ సంస్థ జునూద్ అల్ ఖలీఫా -ఎ-హింద్ సభ్యులని తేలింది. ఐఎస్ ఉగ్రవాదులంతా చిన్న తుపాకులతో ఉండడాన్ని బట్టి వారి లక్ష్యం ఒంటరి దాడులేనని స్పష్టమవుతోంది. జమ్మూకశ్మీర్‌లో కశ్మీరేతర వ్యాపారుల హత్యల సందర్భంలోనూ ఇదే పంథా కనిపించినట్లు పోలీసులు గుర్తుచేస్తున్నాయి.
కశ్మీరేతర వ్యాపారులను పిస్టల్, రివాల్వర్, తపంచా వంటి చిన్న తుపాకులతో మట్టుబెట్టి.. తాపీగా పోలీసుల ముందు నుంచే నడిచి వెళ్లొచ్చనే ఉద్దేశంతోనే ఉగ్రసంస్థలు ఈ తరహా దాడులను ఎంచుకుంటున్నాయి. గతంలో హైదరాబాద్‌లో తహ్రీక్-ఎ-గల్బా ఇస్లాం పేరుతో ఉగ్ర సంస్థను ఏర్పాటు చేసిన వికార్ అహ్మద్, అతని అనుచరుడు సులేమాన్ పోలీసులపై ఇలాంటి దాడులే చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com