Aditya L1 : మరికాసేపట్లో ఆదిత్య L1 మిషన్ ప్రయోగం

Aditya L1 : మరికాసేపట్లో ఆదిత్య L1 మిషన్ ప్రయోగం
నింగిలోకి దూసుకెళ్ళానున్న PSLV-C 57 రాకెట్

చంద్రయాన్ -౩తో చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమైంది. ఆదిత్య ఎల్‌-1 ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్‌లో కౌంట్‌డౌన్‌ మొదలైంది. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్‌ 1ను PSLV-C57 వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లనుంది. 23 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్‌ అనంతరం శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని PSLV-C57 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం.

సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా చేపడుతోన్న ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.తుపాన్ల వల్ల భూమిపై సమాచార వ్యవస్థలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఇస్రో చేపట్టిన ఈ పరిశోధన అంతరిక్ష వాతావరణంపై ఓ అంచనాకు వచ్చేందుకు దోహదపడనుంది.


మొదట ఆదిత్య ఎల్‌-1ను భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లగ్రాంజ్‌ పాయింట్‌. అక్కడ సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. లగ్రాంజ్‌ పాయింట్ 1కు చేరుకునేందుకు ఆదిత్య ఎల్‌ 1కి 125 రోజుల సమయం పట్టనుంది. లగ్రాంజ్‌ పాయింట్‌ వద్ద ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేయవచ్చు అది కూడా గ్రహణాలతో సంబంధం లేకుండా. అక్కడనుంచి సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

ఆదిత్య-ఎల్‌ 1 తీసుకు వెళ్లనున్న ఏడు పేలోడ్లలో ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌, సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లు ఉన్నాయి.

సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్‌, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్‌-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

Tags

Next Story