PM Modi : జన్ ధన్ యోజన.. కోట్ల మందికి గౌరవం తెచ్చింది : మోదీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’పథకానికి బుధవారంతో పదేళ్లు పూర్తయిన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.ఈ పథకం విజయవంతం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ‘సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి.. ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ఈ పథకం అత్యంత ముఖ్యమైంది. ఇది దేశ ప్రజల గౌరవం, సాధికారత, దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపేందుకు ఎంతో ఉపయోగపడింది’ అని ప్రత్యేక పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. ‘జన్‌ధన్ యోజన ప్రారంభించినప్పుడు.. దాని చుట్టూ ఉండే సమస్యలు, సందేహాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం సాధ్యమవుతుందా.? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ, ఈ ప్రయత్నం మంచి మార్పునకు దారి తీస్తుందని నమ్మాను. 53 కోట్ల మందికి పైగా ప్రజలు బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. ఇది ఊహించని పరిణామం. ప్రస్తుతం ఈ ఖాతాల్లో డిపాజిట్ల బ్యాలెన్సు రూ. 2. 3 లక్షల కోట్లు. వీటిలో 65 శాతానికి పైగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల వారు ఉండడం విశేషం. అంతేకాకుండా ఈ పథకం ద్వారా మహిళా సాధికారతను సాధించాం. దాదాపు 30 కోట్ల మందికి పైగా మహిళలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురాగలిగాం’అని ప్రధాని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com