US Vice President : ఇండియాలో జేడీ వాన్స్, ఉషా వాన్స్.. ప్రధానితో భేటీపై ఆసక్తి

US Vice President : ఇండియాలో జేడీ వాన్స్, ఉషా వాన్స్.. ప్రధానితో భేటీపై ఆసక్తి
X

యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం దిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. వారిలో రక్షణ శాఖ, విదేశాంగశాఖ అధికారులు ఉన్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వాన్స్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వాగతం పలికారు. అనంతరం భారత త్రివిధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉష తెలుగమ్మాయి కావడం విశేషం.

జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ గ్రామం. ఆమె అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత యేల్‌ లా స్కూల్‌లో ఉషా, జేడీ వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వారి వివాహబంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లులు ఉన్నారు. అయితే అగ్రరాజ్య ఉపాధ్యకుడిగా జేడీ వాన్స్ విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె అమెరికా సెకండ్‌ లేడీ హోదాలో భారత్‌కు వచ్చారు.

సాయంత్రం 6.30 గంటలకు వాన్స్‌ దంపతులకు లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనపై వారి మధ్య చర్చలు సాగుతాయి. దీంతోపాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతమిచ్చే అవకాశాలపై చర్చిస్తారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ వాన్స్ భారత పర్యటనకు వస్తుండగా భారత్ ఈ రెండు అంశాలను ఆయనతో జరిగే చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత విద్యార్థుల వీసాల రద్దు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. భారత విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ అమెరికా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది.

Tags

Next Story