Fuel Prices : పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సామాన్యుడికి ఊరట.. ధరల పెంచుబోమన్న ఆయిల్ కంపెనీలు.

Fuel Prices : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మండిపోతున్నా, సామాన్యులకు ఊరటనిచ్చే వార్తను అందించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో-బీపీ. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఉద్దేశం తమకు లేదని కంపెనీ స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల బాటలోనే నడుస్తూ, వినియోగదారులపై అదనపు భారం పడకుండా జియో-బీపీ ఈ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటీష్ పెట్రోలియం జాయింట్ వెంచర్ అయిన జియో-బీపీ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకూడదని నిర్ణయించుకుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఉన్న తమ 2,185 పెట్రోల్ బంకుల్లో పాత ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ కష్ట సమయంలో తాము దేశం, ప్రజల పక్షాన నిలబడతామని జియో-బీపీ సీఈఓ అక్షయ్ వాధవా ఒక కార్యక్రమంలో వెల్లడించారు.
ప్రైవేట్ కంపెనీల భిన్న వైఖరి
అయితే, దేశంలోని ఇతర ప్రధాన ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థలు మాత్రం ధరలను పెంచేశాయి. రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ వాటా ఉన్న నయరా ఎనర్జీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3 మేర పెంచింది. అదేవిధంగా షెల్ ఇండియా కూడా తమ బంకుల్లో ధరలను సవరించింది. కానీ జియో-బీపీ మాత్రం అంబానీ మార్క్ భరోసాతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల కొంత ఊరట లభించినప్పటికీ, కంపెనీలు తమ లాభాలను పక్కన పెట్టి సామాన్యుడికి అండగా ఉండటం విశేషం.
పెరుగుతున్న అమ్మకాలు
జియో-బీపీ బంకుల్లో ఇంధన అమ్మకాలు భారీగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. గత మార్చి నెలలో పెట్రోల్ అమ్మకాలు 30 శాతం, డీజిల్ అమ్మకాలు 25 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీనికి ప్రధాన కారణం జియో-బీపీ అందిస్తున్న అడ్వాన్స్డ్ ఎడిటివ్ ఇంధనం. ఈ ఇంధనం వాడటం వల్ల వాహనాలకు మెరుగైన మైలేజీ లభిస్తుందని వినియోగదారులు నమ్ముతున్నారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో జియో-బీపీ వాటా పెట్రోల్‌లో 4 శాతం, డీజిల్‌లో 6 శాతంగా ఉంది.
స్టాక్ కొరత లేదు
కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ఇంధన విక్రయాలపై పరిమితులు విధిస్తున్నారనే ప్రచారాన్ని సీఈఓ అక్షయ్ వాధవా కొట్టిపారేశారు. తమ వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, ఏ బంకులోనూ రేషన్ లాగా ఇంధనాన్ని పోయడం లేదని స్పష్టం చేశారు. అన్ని బంకులు యథావిధిగా పని చేస్తున్నాయని, వినియోగదారులు ఎంత కావాలంటే అంత ఇంధనాన్ని ఎలాంటి ఆందోళన లేకుండా కొనుగోలు చేయవచ్చని ఆయన హామీ ఇచ్చారు. ముడిచమురు రేట్లు ఇంకా పెరిగినా, భవిష్యత్తులో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి మాత్రం పెంపు లేదని తేల్చి చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
