Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతిపై న్యాయ విచారణ

ఉత్తర్‌ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, రాజకీయనేత ముఖ్తార్ అన్సారీ మరణంతో UP పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్ గట్టి నిఘా వేసింది. ముఖ్తార్ అన్సారిపై విషప్రయోగం జరిపి హత్య చేశారని అతడి కుటుంబం ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీఎస్పి, సమాజ్‌వాదీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, రాజకీయనేత ముఖ్తార్ అన్సారీ మృతి చెందడంతో.. యుపి పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడ వద్దని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. నకిలీ వార్తలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్ గట్టి నిఘా వేసింది.
బాందా జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో.. ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకుంటున్న కారణంగా ముఖ్తార్‌ను భారీ బందోబస్తు మధ్య గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చాలని భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతోనే మృతిచెందినట్లు రాణీ దుర్గావతి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి..
ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులు మాత్రం.. పోలీసుల వివరణను నమ్మడం లేదు.ఆయనకు స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితంతండ్రిని కలిసేందుకు వెళ్లినా తనను అనుమతించలేదని ముఖ్తార్ కుమారుడు ఉమర్ అన్సారీ వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం బాలేకున్నా.. ఆసుపత్రి నుంచి జైలుకు తరలించారని చెప్పారు. తన తండ్రి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తోందని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అన్సారీ మృతి రాష్ట్రంలో దుమారం రేపుతోంది. మరణంపై దర్యాప్తు పారదర్శకంగా జరపాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బిఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఖైదీలు అనుమానాస్పదంగా మృతి చెందితే.. సమగ్రదర్యాప్తు జరపాలని లేదంటే న్యాయవ్యవస్థపై విశ్వాసం పోతుందన్నారు.
ముఖ్తార్ అన్సారి 15 ఏళ్ల వయస్సులోనే నేర ప్రపంచంలో అడుగుపెట్టారు. కిడ్నాప్, హత్యలు సహా 65 క్రిమినల్ కేసులు ఆయనపై ఉన్నాయి. 8 కేసుల్లో అన్సారీ దోషిగా తేలి శిక్ష అనుభవించారు. 2020 తర్వాత క్రమంగా అన్సారీ నేర సామ్రాజ్యాన్ని పోలీసుల కూల్చివేశారు. అన్సారీ ముఠాకు చెందిన 608 కోట్ల అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 215 కోట్ల విలువైన అక్రమ కాంట్రాక్టులు, టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com