Karnataka CM : ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు ప్రకటించి.. పోస్టు డిలీట్ చేసిన కర్నాటక సీఎం
రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థల్లోని గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే100 శాతం రిజర్వేషన్లకు వీలు కల్పించే బిల్లుకు ఆమోదం తెలుపుతూ కర్నాటక మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను చేసిన పోస్టును తొలగించారు. ఆ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాత సీఎం సిద్ధరామయ్య ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘రాష్ట్రంలో నెలకొల్పిన అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో సి, డి గ్రేడ్ పోస్టులకు సంబంధించి 100 శాతం కన్నడిగుల నియమకాన్ని తప్పనిసరి చేసే బిల్లు కోసం మంత్రివర్గం సమావేశమై ఆమోదం తెలిపింది. రాష్ట్ర వాసులు సుఖవంతమైన జీవనం గడిపేందుకు అవకాశం కల్పించాలని, ఈ గడ్డపై ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే మా ప్రభుత్వ ఆకాంక్ష. మాది కన్నడ అనుకూల ప్రభుత్వం. వారి సంక్షేమమే మా ప్రాధాన్యం’’ అని సీఎం అన్నారు. ఆ విషయాన్ని వెల్లడిస్తూ చేసిన పోస్టును ఆయన తొలగించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com