Priyanka: బెంగళూరు రోడ్డుకు మరో జీవితం బలి

సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో రోడ్ల దుస్థితి మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. రోడ్డుపై ఉన్న ఓ గుంతను తప్పించే ప్రయత్నంలో 26 ఏళ్ల ప్రియాంక బైక్‌పై నుంచి కిందపడి, వెనుక నుంచి వచ్చిన ట్రక్కు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన నగరంలోని నెలమంగళ సమీపంలో చోటుచేసుకుంది.
ప్రియాంక తన సోదరుడితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తోంది. మార్గం మధ్యలో రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఓ గుంతను తప్పించేందుకు ఆమె సోదరుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ఇద్దరూ కిందపడిపోయారు. హెల్మెట్ ధరించి ఉండటంతో ఆమె సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానీ, ప్రియాంక రోడ్డుకు అవతలి వైపు పడటంతో, అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఈ ప్రమాదంతో బెంగళూరు నగరంలో రోడ్ల భద్రత, పౌర అధికారుల నిర్లక్ష్యం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, రోడ్ల మరమ్మతులపై అధికారులు దృష్టిసారించడం లేదని నగరవాసులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబర్‌లో ఇలాగే బుడిగేరే క్రాసింగ్ వద్ద 20 ఏండ్ల కాలేజీ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలింది. మరోవైపు వారంలోగా బెంగళూరులోని రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చి వేయాలని సీఎం సిద్ధరామయ్య ఈ నెల 21న అధికారులను ఆదేశించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

