Nepal Bus Accident: త్రిశూలి నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి!

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటక నగరం పోఖారా నుంచి రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి త్రిశూలి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ధాడింగ్ జిల్లాలోని పృథ్వీ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెనిఘాట్ రోరాంగ్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి సుమారు 300 మీటర్ల లోతులో ఉన్న నది ఒడ్డున పడిపోయింది. దీంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఈ ప్రమాదంలో మొత్తం 27 మందిని సురక్షితంగా కాపాడి, చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో 11 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదానికి దట్టమైన పొగమంచు లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో బస్సు పూర్తిగా మునిగిపోకుండా ఒడ్డున పడటం వల్ల ప్రాణ నష్టం కొంతమేర తగ్గిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
