Kerala: రైతుపై దాడిచేసే పులిని చంపేయండి- కేరళ ప్రభుత్వం

Kerala: రైతుపై దాడిచేసే  పులిని చంపేయండి-  కేరళ ప్రభుత్వం
మ్యాన్ ఈటర్‌ను చంపేయాలని సర్కారు ఆదేశం

కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లాలో మనుషులను చంపి అలజడి సృష్టించిన పెద్ద పులి ని చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పశువుల కోసం గడ్డికోయడానికి పొలంలోకి వెళ్లిన ఓ రైతుపై పులి పంజా విసిరింది. అతడిపై దాడిచేసి చంపేసిన ఆ పులి.. మృతదేహంలో కొంత భాగాన్ని పీక్కుతుంది. అత్యంత భయానకమైన ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడి జనం బెంబేలెత్తిపోయారు. పులి అలజడి సృష్టించడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిని చంపేయాలంటూ సోమవారం ఉత్తర్వులు వెలువరించింది.

శనివారం పులి దాడిలో మృతి చెందిన వ్యక్తి కేరళలోని వాయనాడ్‌కు చెందిన 36 ఏళ్ల ప్రజీశ్‌గా గుర్తించారు. ప్రజీశ్‌ గడ్డి కోయడానికి వెళ్లిన సమయంలో పులి అతనిపై ఒక్కసారిగా దాడి చేసింది. అతని శరీరంలో కొంతభాగాన్ని తినేసింది. ఆ ఘటన స్థానికంగా తీవ్ర అలజడి రేపింది.

ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కారంపై హామీ ఇచ్చే వరకు మృత దేహాన్ని అక్కడి నుంచి తరలించేది లేదని పట్టుబట్టారు. రక్షణ చర్యలు చేపట్టాలని, పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఉత్తర్వులు వెలువరించిన అటవీ శాఖ.. వీలైతే దానిని ప్రాణాలతో పట్టుకోవాలని, లేకుంటే చంపేయాలని పేర్కొంది.

అయితే, చంపడానికి ముందు అది మ్యాన్‌ ఈటర్‌ అవునా..? కాదా..? అనేది ధ్రువీకరించుకోవాలని సూచించింది. టార్గెట్‌ చేసిన పులి మ్యాన్‌ ఈటర్ అని రూఢీ చేసుకున్న తర్వాత దాన్ని బంధించలేకపోతే చంపేయాలని పేర్కొన్నది. దాంతో పులి జాడ గుర్తించేందుకు అటవీ శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దానికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

తొలుత పులిని సురక్షితంగా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని, నరభక్షక పులిని చంపేంత వరకూ ప్రజీష్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్‌ సత్వరమే చర్యలు తీసుకుంటామని మృతుడి కుటుంబానికి హామీ ఇచ్చారు. పులిని చంపేందుకు కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. నష్టపరిహారంగా రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు.

Tags

Next Story