Kharge : బడ్జెట్ లేకుండా గ్యారంటీలు వద్దు.. కాంగ్రెస్ సీఎంలకు ఖర్గే సూచన

కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు కర్ణాటక కాంగ్రెస్ ను ఆయన నిలదీశారు. బడ్జెట్ ను పరిగణనలోకి తీసుకోకుండా ఎలాంటి హామీలను ప్రకటించవద్దని కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి గ్యారెంటీలూ ప్రకటించడం లేదని ఖర్గే స్పష్టం చేశారు. ‘త్వరలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ ఒక్క హామీని ప్రకటించడం లేదు. బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించాలి. లేదంటే రాష్ట్రం దివాలా పరిస్థితికి చేరుకుంటుంది. ప్రణాళికా రహిత విధానం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు. ప్రభుత్వం విఫలమైతే కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తప్ప మరొకటి మిగలదు' అంటూ శుక్రవారం ముంబైలో ఖర్గే చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com