POLYGRAPH TEST: కోల్‌కత్తా హత్యాచార నిందితులకు లై డిటెక్టర్ టెస్ట్
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన నిందితుడు సంజయ్ రాయ్ సహా మరో ఆరుగురికి సీబీఐ అధికారులు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంజయ్ ఉన్న జైల్లోనే లై డిటెక్టర్ పరీక్ష నిర్వహిస్తున్నారు. డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు, మరో సివిల్ వాలంటీర్‌కు కూడా ఈ పరీక్ష చేయనున్నారు. ఈ కేసులో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, బాధితురాలిపై హత్యాచార ఘటన చోటుచేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు, మరో సివిల్ వాలంటీర్‌కు కూడా నేడు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం కోల్‌కతా చేరుకుంది. ప్రస్తుతం ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి.
ఏమిటీ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్
పాలీగ్రాఫ్ టెస్టునే లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు నిందితులు నిజాలు చెబుతున్నారా లేదా అబద్ధమాడుతున్నారా? అనే విషయాన్ని దీని ద్వారా గుర్తించవచ్చు. ఇందులో ఎటువంటి ఔషధాలు, మత్తు మందులు వినియోగించరు. కేవలం వ్యక్తి శరీరానికి కార్డియో-కఫ్‌లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్‌లతోపాటు ఇతర పరికరాలు మాత్రమే అమర్చుతారు. వీటితో ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వీటివల్ల తెలుసుకోవచ్చు. ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతడి శరీరంలో మార్పులు కనబడతాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటు మారుతుంది. తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా..? కాదా? అని వాటికిచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గ్రహిస్తారు. అయితే, ఇందులో వ్యక్తి వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరీక్షను 19వ శతాబ్దంలో ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్ తొలిసారి వినియోగించినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది.
నిందితుడి శరీరంపై గోర్ల గీతలు
కోల్‌కతాలోని RG కర్ ఆస్పత్రిలో డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన 10 గంటల తరువాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల నోట్స్ ప్రకారం.. ‘నిందితుడి ఎడమ చెంపపై గోర్ల గీతలు, ఎడమ చేతి వేళ్ల మధ్య రాపిడి గుర్తులు, ఎడమ తొడ వెనుక భాగంలో రాపిడితో సహా కొన్ని గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com